Vijayashanti to join Congress?: సినీ నటి, బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి(Vijayashanti) మళ్లీ కాంగ్రెస్(Congress) గూటికి చేరే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia gandhi)ని ప్రశంసిస్తూ ఆమె చేసిన ట్వీట్ వెనుక ఆంతర్యం అదేనని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. అందుకు చాలా బలమైన వాదనను వినిపిస్తున్నారు విశ్లేషకులు. ఇటివలి కాలంలో బీజేపీలో ఉన్నామా లేమా అన్న రీతిలో విజయశాంతి తీరు సాగుతోంది. బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారు ఈ లేడి అమితాబ్. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారని ఇంటర్నెల్ టాక్. అటు బీజేపీ కూడా కీలక సమావేశాలకు విజయశాంతిని పిలవడంలేదు. దీనిపై కూడా ఆమె అసంతృప్తిగా ఉన్నారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
వాటి అర్థం అదేనా?
పార్టీ ఏం చేసినా దాన్ని సమర్థించాలని లేదు కానీ చాలా మంది రాజకీయ నేతలు మాత్రం అలానే ఉంటారు. ఒకవేళ పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం నచ్చకపోతే సైలెంట్‌గా ఉంటారు కానీ బహిరంగంగా మాత్రం కామెంట్స్ చేయరు. అయితే ఇటివలి కాలంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలను విజయశాంతి అందరిముందే విమర్శలు గుప్పించారు. బండిని అధ్యక్ష పదవి నుంచి తొలగించడాన్ని బహిరంగంగానే తప్పు పట్టారు. అటు మణిపూర్ అంశంపైనా పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు ఈ లేడి అమితాబ్. కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోనియాని పొగుడుతూ ట్వీట్:
తాజాగా సోనియాగాంధీని ప్రశంసిస్తూ విజయశాంతి ట్వీట్ చేయడం ఆమె పార్టీ మారుతారన్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. తెలంగాణ ఇచ్చిన సోనియాను అభిమానంతో చూస్తామంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనన్న రాహుల్ వ్యాఖ్యలకు సమర్థించారు. ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన జిట్టా, యెన్న శ్రీనివాస్ రెడ్డి బాటలోనే విజయశాంతి నడవాలని నిర్ణయించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. నిజానికి 1998లో విజయశాంతి భారతీయ జనతా పార్టీలో చేరారు. జనవరి 2009లో తన సొంత రాజకీయ పార్టీ అయిన తల్లి తెలంగాణను ప్రారంభించారు, బలం, మద్దతు లేకపోవడంతో ఆమె తన పార్టీని భారత రాష్ట్ర సమితి (BRS)లో విలీనం చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో విభేదించిన విజయశాంతి ఫిబ్రవరి 2014లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక నవంబర్ 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి డిసెంబర్ 2020లో హోం మంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో తిరిగి చేరారు . ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గూటికే రాములమ్మ చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.
ALSO READ: రాష్ట్ర విభజన మీద ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్