శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులు సేవ కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఆన్ లైన్ విధానం ద్వారా మరింత పారదర్శకంగా శ్రీవారి సేవ కేటాయించడం జరుగుతుందని తెలిపారు. శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన 'డయల్ యువర్ ఈవో' కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ధర్మారెడ్డి సమాధానం ఇచ్చారు. శ్రీవారి సేవ అనేది ఆన్ లైన్ ద్వారా మాత్రమే కేటాయిస్తారని.. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే భక్తులు నమ్మవద్దని సూచించారు. సేవ సాఫ్ట్ వేర్ ఖచ్చితంగా ఉంటుందని.. దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరని ధర్మారెడ్డి తెలిపారు.
శ్రీవారి సేవ చేస్తున్న మహిళలను గౌరవప్రదంగా 'అమ్మ' అని పిలవాలన్నారు. సేవ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్, లక్కీ డిప్ విధానం, తిరుమల సీఆర్వో వద్ద ఒకరోజు ముందుగా పేర్లను నమోదు చేసుకుంటే డిప్ ద్వారా సేవా టికెట్లు కేటాయించబడుతుందని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఆన్ లైన్ లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 15 వేలు, ఎస్ ఎస్ డి టోకెన్లు 15 వేలు, దివ్యదర్శనం టోకెన్లు 15 వేలు తిరుపతిలో కేటాయిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుండి ఫ్రీ దర్శనానికి అనుమతిస్తామన్నారు.
తిరుమలలో ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ధర్మ రథాలు ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు వస్తుందని.. బస్ స్టాప్స్ దగ్గర ఆపుతారన్నారు. ప్రతిరోజు అంగప్రదక్షిణకు 750 టికెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఇవి కూడా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నామన్నారు ఈవో ధర్మారెడ్డి. తిరుమలలో ఆ రోజు భక్తుల రద్దీ దృష్ట్యా లెటర్ ద్వారా ఇచ్చే బ్రేక్ దర్శనాల సంఖ్యను తగ్గిస్తామన్నారు.
ఇక తిరుపతిని క్యాన్సర్ రహిత ప్రాంతంగా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు ఈవో. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం కోసం ఒక పింక్ బస్సును ఆధునిక వైద్యపరికరాలతో జిల్లా యంత్రాంగానికి విరాళంగా అందిస్తామన్నారు. అలాగే గూడూరు, చంద్రగిరి, శ్రీకాళహస్తిల్లో క్యాన్సర్ నిర్ధారిత కేంద్రాలకు మరో పింక్ బస్ అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
స్విమ్స్ లో త్వరలో లివర్ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే స్విమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం రాష్ట్రంలో మరెక్కడా లేని హెచ్ పీబీ సర్టిఫికేట్ కోర్సును నిర్వహిస్తోందన్ని చెప్పారు. ఎయిమ్స్ తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో ఎంటరాలజీ చదువుతున్న ఫైనలియర్ విద్యార్థులు ఈ కోర్సును అభ్యసిస్తున్నారన్నారు. 50 సీట్లు ఉన్నాయని.. వీరికి ప్రముఖ వైద్యులతో శిక్షణ ఇస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.