తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఛైర్మన్ గా ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అర్చకులు రంగనాయక మండపంలో భూమన కరుణాకర్‌రెడ్డికి వేద ఆశీర్వచనం అందజేశారు.
తనను టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పద్మావతి పురంలోని ఇంటి వద్ద నుంచి బయలుదేరిన భూమన గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలిపిరి వద్ద గోపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
భూమనకు టీటీడీ జీఈవో సదా భార్గవి స్వాగతం పలికారు. శ్రీవారి ఆలయంలో ఉదయం 11: 44 గంటలకు టీటీడీ చైర్మన్‌గా భూమన ప్రమాణ స్వీకారం చేశారు. భూమన బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో తిరుపతి నగరంలో అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది తిరుమలలో రెండు పర్యాయాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు , అక్టోబర్ 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీడీడీ నిర్ణయించింది.
టీటీడీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియటంతో సీఎం జగన్ టీటీడీ బాధ్యతలు భూమనకు అప్పగించారు.వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి పనిచేశారు.
టీటీడీపై ప్రతిపక్షాలు ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటిని తప్పి కొట్టటంతో పాటుగా టీటీడీ పాలనలో అనుభవం ఉన్న భూమన ను సీఎం జగన్ ఏరి కోరి ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఇదే విధంగా టీటీడీ సభ్యుల విషయంలోనూ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా టీటీడీ నూతన పాలకమండలిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల సమయం కావటంతో సభ్యుల ఎంపిక విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఏపీతో పాటుగా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి సభ్యుల ఎంపిక చేయనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ గా కొలువు తీరిన భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. సామాన్య భక్తుడే తన తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. హిందూ ధార్మికతను పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
జీవితంలో ఒక్కసారైనా ఆ దేవ దేవుడు శ్రీనివాసుడిని, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కోవాలని అనుకుంటారని, అంతే కాదు ఎంతో మంది టీటీడీ చైర్మన్ కావాలని అనుకుంటారని చెప్పారు. కానీ ఆ అవకాశం నేటితో రెండోసారి దక్కిందని, ఇది తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.