GROUP-1: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకునేందుకు తొలుత ఈ నెల 14 వరకు అవకాశం ఇచ్చిన టీఎస్ పీఎస్సీ.. ఆ తర్వాత మరో రెండు రోజులు గడువు పొడిగించింది. ఈ పోస్టులు ఎక్కువగా ఉండటంతో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మొత్తం 4.03 లక్షల దరఖాస్తులు వచ్చాయని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 503 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఒకసారి పేపర్ లీకేజీ కారణంగా పరీక్ష నిర్వహించే సమయంలో బయోమెట్రిక్ తీసుకోకపోగా, హైకోర్టు తీర్పుతో మరోసారి పరీక్షను రద్దు చేశారు. ఫలితంగా ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.మరో 60 పోస్టులతో సహా 563 గ్రూప్-1 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ALSO READ: రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభ
గత నోటిఫికేషన్‌లో 503 పోస్టులకు 3.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి 563 పోస్టులకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ పడుతున్నారు. కాగా, దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులను సవరించుకునేందుకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. కాగా, గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21న నిర్వహిస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించగా.. ఈ మేరకు కూడా ఏర్పాట్లు ప్రారంభించింది. గతంలో పేపర్ లీకేజీ నేపథ్యంలో.. ఈసారి గ్రూప్-1 పరీక్షను కట్టుదిట్టమైన చర్యలతో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది.