Telangana Elections 2023: ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోస్టల్ బ్యాలెట్లను శనివారం వరకూ స్ట్రాంగ్ రూంకు తరలించకుండా ఎందుకు ఆగారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆర్డీవోను నిలదీస్తూ ఆందోళనకు దిగాయి. నవంబరు 29నే పోస్టల్ బ్యాలెట్ల ద్వారా వివిధ శాఖల సిబ్బంది ఓటుహక్కును వినియోగించుకోగా, వాటిని ఇన్ని రోజులుగా స్ట్రాంగ్ రూంకు తరలించకపోవడంపై కాంగ్రెస్ నాయకులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. విధి నిర్వహణలో ఇంత అలసత్వం ప్రదర్శిస్తే ఎలా అంటూ అధికారులపై కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, 144 సెక్షన్
అంతేకాకుండా, పోస్టల్ బ్యాలెట్లకు సీల్ కూడా వేయకపోవడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇన్నిరోజులు గడుస్తున్నా పోస్టల్ బ్యాలెట్లను తరలించకపోవడంతో పాటు స్ట్రాంగ్ రూంకు తరలించిన శనివారం రోజునే సీల్ వేయడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఆర్డీవోను, సంబంధిత అధికారులను కాంగ్రెస్ శ్రేణులు నిలదీస్తూ ఆందోళనకు దిగాయి.