TG:తెలంగాణలోని బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్‌ఈడీసెట్-2024 ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం ప్రకటించనున్నారు. ఈ ఫలితాలను ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేస్తారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అభ్యర్థులు అవసరమైన వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఎడ్‌సెట్ ర్యాంక్ కార్డులను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. టీజీ ఎడ్‌సెట్ 2024 పరీక్షను మే 23న నిర్వహించారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరిగాయి. మొదటి సెషన్‌లో ఉదయం , రెండో సెషన్‌లో మధ్యాహ్నం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
మొదటి సెషన్‌లో 16,929 మంది అభ్యర్థులకు 14,633 మంది, రెండవ సెషన్‌లో 16,950 మందికి 14,830 మంది హాజరయ్యారు. మొత్తం హాజరు 87%. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఈ ఏడాది ఎడ్సెట్ పరీక్షల బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల BEd (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశాలు ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహించబడతాయి. రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో మొత్తం 14285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.