తెలంగాణ బీజేపీ (Telangana BJP) అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ కారణంగా ఆ పార్టీలో మొదలైన వివాదాలు ఇంకా చల్లారడం లేదు. మాజీ ఎంపీ వివేక్ (Ex MP Vivek) టార్గెట్ గా బెల్లంపల్లి అసమ్మతి నేత కొయ్యల హేమాజి మరో సారి విమర్శలు గుప్పించారు. అనుచరులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. అన్నను గెలిపించేందుకే బెల్లంపల్లి లో వివేక్ వెంకటస్వామి డమ్మీ అభ్యర్థికి టికెట్ ఇప్పించారని తీవ్ర ఆరోపణలు చేశారు. వివేక్ అనుచరులు బీజేపీ కండువాలు కప్పుకుని కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. బలంగా ఉన్న తనను కాదని డిపాజిట్ రాని అభ్యర్థికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. శ్రీదేవి అభ్యర్థిత్వాన్ని వెంటనే రద్దు చేయాలని పార్టీ హైకమాండ్ ను హేమాజి డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: TS BJP: తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల సీక్రెట్ మీటింగ్.. అందుకోసమేనా?
ఫోన్ చేస్తే అగ్రనేతలు పట్టించుకోకపోవడంతోనే ఇలా పార్టీ ఆఫీస్ కు వచ్చి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. వివేక్, ఆయన అనుచరులు పథకం ప్రకారం బెల్లంపల్లిలో పార్టీని నాశనం చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి, ప్రజల్లో గుర్తింపు ఉన్న తనకు టికెట్ ఇవ్వకుండా నెల రోజుల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. బెల్లంపల్లిలో మరో సారి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన సర్వేలో తనకు 56 శాతం వచ్చిందన్నారు.