భాగ్యనగరానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్న నేపథ్యంలో రెండు రోజులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు సిటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్ర, శని వారాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లు అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు.. రేపు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు.
మొనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, ఎంఎంటీఎస్, వివి స్టాట్యూ జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్, సీటీవో జంక్షన్, పీఎన్‌టీ ఫ్లైఓవర్, జంక్షన్, హెచ్‌పీఎస్ స్కూల్ ఔట్‌గేట్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్‌లోని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి వయా బేగంపేట మీదుగా మెహిదీపట్నం, అమీర్‌పేట, వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ రూట్‌లో రాకుండా అప్పర్ ట్యాంక్‌బండ్‌పై నుంచి వెళ్లేందుకు మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు.
రాజ్‌భవన్ రోడ్, మొనప్ప జంక్షన్, ఖైరతాబాద్ ఈ మార్గాల్లో రెండు వైపులా రోడ్ క్లోజ్ ఉంటుంది. పంజాగుట్ట రాజ్‌భవన్ క్వార్టర్స్ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు. సీటీవో జంక్షన్, మినిష్టర్ రోడ్డులో వచ్చే వాహనాలను రసూల్‌పురా జంక్షన్ వద్ద కొంత సమయం పాటు నిలిపివేస్తారు. పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్ మీదుగా బేగంపేట ఎయిర్‌పోర్టు మీదుగా వచ్చే వాహనాలను ప్రకాష్‌నగర్ టీ జంక్షన్ వద్ద కొంత సమయం నిలుపుదల ఉంటుదన్నారు. ఈ రూట్‌లలో ప్రయాణించే వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ రూట్‌లలో వెళ్లాలని అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ వివరించారు.