ఎన్నికలు (Telangana Elections 2023) దగ్గర పడుతున్నా కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెబుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopeal Reddy) ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. తాజాగా మరో కీలక నేత పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ (Vivek Venkataswamy) కూడా పార్టీ వీడేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలస్తోంది. ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. నిన్న రాత్రి వివేక్ ఫామ్ హౌస్ కు రేవంత్ రెడ్డి వెళ్లి ఆయనతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు మరో షాక్.. బీఆర్ఎస్ లోకి నాగం జనార్ధన్ రెడ్డి?
ఈ సందర్భంగా వివేక్ ను పార్టీలోకి ఆహ్వానించి... చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. తాను ఎంపీగానే పోటీ చేస్తానని, అసెంబ్లీకి ఆసక్తి లేదని వివేక్ విముఖత చూపినట్లు సమాచారం. అయితే.. ముందు అసెంబ్లీకి పోటీచేయాలని.. పార్లమెంట్ సంగతి తర్వాత చూద్దామని వివేక్ కు రేవంత్ చెప్పినట్లు తెలుస్తోంది. రేవంత్ ఆహ్వానంపై వివేక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశం రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. చెన్నూరు అభ్యర్థిని కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. వివేక్ కోసమే ఆ సీటును హోల్డ్ లో పెట్టినట్లు చర్చ సాగుతోంది.