ఆంధ్రప్రదేశ్ లో టమాటా ధరలు తగ్గిపోయాయి. ఇది ప్రజలకు మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మొన్నటి వరకూ భయపెట్టిన టమాటా ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. కిలో రూ.70 నుంచి రూ.100 తగ్గిపోయాయి. టమాటా ధరలు ఈ మధ్య వరకూ డబుల్ సెంచరీని దాటేశాయి. దాని వైపు చూడాలంటేనే భయపడిపోయేవారు సామాన్యులు. దాని పేరే ఎత్తడం మానేశారు. టమాటా ధరలు ఇంకా పెరుగుతాయోమోనని అంచనా వేయగా.. ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేయగా.. రైతుల్లో మాత్రం ఆందోళన మొదలైంది.
ఆదివారం అనంతపురం కక్కల పల్లి మార్కెట్ లో కిలో మొదటి రకం టమాటా ధర రూ.110 నుంచి రూ.75 వరకూ పలికింది. అలాగే 15 కిలోల బుట్ట మొదటి రకం రూ.1,650, రెండో రకం రూ.1,350, మూడో రకం రూ.1,125 చొప్పున ధర పలికింది. ఆదివారం మార్కెట్ కు మొత్తం 750 టన్నులు వచ్చాయి. మరోవైపు అన్నమయ్య జిల్లా ములకల చెరువు వ్యవసాయ మార్కెట్ లో రెండు రోజులుగా టమోటా ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
మొన్నటి వరకు రూ.4300 పలికిన 23 కేజీల బాక్సు ధర ఆదివారం మాత్రం రూ.2300కి చేరింది. అంటే సగానికి సగం ధర పడిపోయింది. టమాటా నాణ్యతను బట్టి బాక్సు రూ.1500 నుంచి రూ.2300 వరకు పలికింది. టమాటాల ధర మళ్లీ పడిపోవడంతో టమాటా రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ ధరలు మరింత తగ్గుతాయేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గినా సరే మార్కెట్ ల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ కు ఎగుమతి అవుతున్నాయి.
అలాగే అనంతపురం, చిత్తూరు జిల్లాలో టమాటా కొత్త పంట కోతకు వచ్చాయి. మరోవైపు వైరస్ కారణంగా కర్ణాటకలో టమాటా పంటలు దెబ్బతినడంతో ధరలు నిలకడగా ఉండవచ్చని పలువురు రైతులు ఆశగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది చూడాలి. మార్కెట్ లో ధరలు తగ్గడంతో ఇటు వ్యాపారులు కూడా కొంత రేటును తగ్గించారు. మొన్నటి వరకు టమాటాల పేరు చెబితేనే భయపడిన సామాన్యుడు ధరలు కాస్త తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.