CM Revanth Love Story: తననెవరూ ఆపలేరు.. అదేమిటో గానీ, ఆమె గీసిన 'గీత' తనే దాటలేడు! పదునైన మాటలతో ప్రత్యర్థులు బిత్తరపోయేలా చేయగల మాటకారి అయి ఉండీ, ఆమె మాటాడితే ఎదురు చెప్పలేని నిరుత్తరుడవుతాడు! కోట విడిచి తనకోసం నడిచొచ్చిన రాకుమారి కదా మరి! తనలో సగం కాదు.. సమస్తమూ తనే అయిన ప్రేమికుడాయె! ఆమె ప్రేమ కోసం చకోరంలా నిరీక్షించి, ఆ ప్రేమ ఇచ్చిన గెలుపుతో చిచ్చరపిడుగయ్యాడు. ఆమె గీత.. ఆయన రేవంత్‌రెడ్డి. కొండారెడ్డిపల్లె పిల్లగాడిగా ఉన్న పెయింటర్, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా మారే వరకూ ప్రతి అడుగులో ఆమె ఉంది. ప్రతీ మలుపులో ముందుండి నడిపింది. నేడు వారి పెళ్లి రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి-గీత లవ్ స్టోరీపై స్పెషల్ స్టోరీ..
ఇలా మొదలైంది..
వాళ్లది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. చుట్టాల పెళ్లిలో ఓ శుభవేళ వారి చూపులు కలిశాయి. 'గుండెనిండా గుడిగంటలు' బ్యాగ్రౌండ్‌లో మోగుతుండగా.. గీతను చూసిన రేవంతుడు ప్రేమలో పడ్డాడు. క్షణమాలస్యం చేయలేదు. తన వెంటే ఉంటే 'గీత' దాటనని ప్రమాణం చేశాడు. ఏంచెప్పి మాయచేశాడోగానీ మొత్తానికి ఒప్పించాడు. అలా మొదలైంది వారి ప్రేమప్రయాణం. అప్పుడేమైనా ఫోన్లా, వాట్సప్పులా.. కలిసి మాట్లాడుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారో! పైగా, ఇక్కడే ఓ ట్విస్టుంది. ఆమె సామాన్యురాలు కాదు.. రాజకీయోద్దండుడు జైపాల్‌రెడ్డికి స్వయానా తమ్ముడి బిడ్డ. అయినా, రేవంత్ వెనుకడుగు వేయలేదు. అప్పుడప్పుడే వృత్తి జీవితం ప్రారంభించి, విద్యార్థి నేతగా ఎదుగుతున్న ఆయన ఎలాగైన తన ప్రేమను గెలిపించుకోవాలని కృతనిశ్చయుడయ్యాడు.
ఇంట్లో తెలిసింది..
అందరిలాగే వారిద్దరూ కొన్ని రోజులు రహస్యంగా ప్రేమించుకున్నారు. ఎన్నిరోజులని దాయగలరు? ఓ రోజు గీత తండ్రికి విషయం తెలిసింది. ఇక రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్ల నాన్నతో విషయం చెప్పాడు. కోటలోని యువరాణి పేద ప్రేమను ఆమె కుటుంబం సహజంగానే అంగీకరించలేదు. సామాజిక వర్గ సమస్య కూడా లేకపోయినా రేవంత్ పేదరికమే గీత తండ్రి నిరాకరణకు కారణమైంది.
ఓవర్ టు ఢిల్లీ..
ఇక వారి లవ్ స్టోరీ ఢిల్లీకి చేరింది. ఇద్దరి మధ్యా కాంటాక్ట్ తెగిపోయింది. గీత తండ్రి కూతురిని ఢిల్లీలోని జైపాల్‌రెడ్డి ఇంటికి పంపించారు. జైపాల్‌రెడ్డి తెలుసుకదా.. తెలంగాణ రాజకీయాల్లో భీష్ముడి వంటి వ్యక్తి. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి. ఆయనతో మాట్లాడడమే సాహసం అనుకోవాల్సిన సమయంలోనూ రేవంత్ తగ్గేదే లేదన్నాడు. రాజకీయంగా ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా డోంట్ కేర్ అన్నాడు. తీరా ఓ రోజు వెళ్లి ఆయనతోనే తేల్చుకున్నాడు. తనగురించి, తమ ప్రేమగురించి ఉన్నదున్నట్టు చెప్పేశాడు. తనేంటో, తన ఆశయాలేమిటో పెద్దమనిషికి అర్థమయ్యేలా చెప్పగలిగాడు. ఎప్పటికైనా ఓ స్థాయికి ఎదిగితీరుతాడన్న నమ్మకాన్ని కల్పించగలిగాడు.
పెద్దమనిషి ఇంప్రెస్ అయిపోయాడు!
రేవంత్‌రెడ్డి ధైర్యం, చురుకుదనం, ప్రతిభ చూసిన జైపాల్‌రెడ్డి ఎట్టకేలకు కన్విన్స్ అయ్యాడు. ఆ యువకుడు ఎప్పటికైనా ఉన్నత స్థాయికి ఎదుగుతాడని అప్పుడే గ్రహించాడు. తన తమ్ముడికి చెప్పి బిడ్డ భవిష్యత్తుపై భరోసా ఇచ్చాడు. పెద్దమనిషి చెప్పిన తర్వాత ఇంకేముంది?.. అలా 1992, మే 7న గీత, రేవంత్ రెడ్డి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఆమె తన జీవితంలో అడుగుపెట్టిన వేళావిశేషం.. రేవంత్ కెరీర్‌లోనూ ఎదుగుదల మొదలైంది. వ్యాపార రంగంలో అడుగుపెట్టిన ఆయన క్రమంగా ఎదుగుతూ, తన చిరకాల ఆశయమైన రాజకీయ రంగంలోకి ప్రవేశించాడు. విద్యార్థి రాజకీయాల అనుభవంతో క్రియాశీల రాజకీయాల్లోనూ అంచెలంచెలుగా ఎదిగారు. ఒడుదుడుకులు ఎదురైనా ఎక్కడా తగ్గలేదు. ఆమె వెన్నంటే ఉండి ప్రోత్సహించడంతో వెనుకడుగు వేయలేదు. ఆయన గెలిపించుకున్న ప్రేమ ఆయనను గెలిపించింది.