జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) మావాడే అంటారు.. అతని సినిమాల సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తారు.. జూనియర్ ఏం చేసినా సినీయర్ గుర్తొస్తాడని గొప్పలు చెబుతారు. అతని డ్యాన్స్ చూసి మురిసిపోతారు. ఇది సినిమా పరంగా జూనియర్ ఎన్టీఆర్‌ని అభిమానించే టీడీపీ కార్యకర్తల తీరు. అయితే రాజకీయంగా మాత్రం సీన్ కాస్త రివర్స్‌గా ఉంటుందని చాలా కాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ స్నేహితులు వైసీపీలో ఉన్నారని.. చంద్రబాబు కోసం జూనియర్ నిలబడడం లేదంటూ తెలుగు తమ్ముళ్లు చాలా కాలంగా ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన తిరువూరు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ కార్యకర్తల గొడవ మరోసారి రచ్చకెక్కింది.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్‌పై దాడి:
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ప్రభుత్వం 30 ఏళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు(Tiruvuru)లో 'రా కదలి రా' పేరుతో టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలంతా ఏకమై రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఉండి ఉంటే హైదరాబాద్ తరహాలోనే అమరావతి కూడా అభివృద్ధి చెందేదన్నారు. అటు మరోవైపు ఈ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు టీడీపీ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది.
ఫొటోలు విసిరేశారు:
తిరువూరు బహిరంగ సభకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలివచ్చారు. తిరువూరులో జూనియర్ అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు సభ కావడంతో వారంతా పసుపు దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. తమతో పాటు తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను కూడా తెచ్చుకున్నారు. ఈ ఫొటోల గురించే వివాదం జరిగినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఫొటోలను తీసివేయాలని టీడీపీ కార్యకర్తలు చెప్పారని.. అందుకు తారక్ ఫ్యాన్స్ అంగీకరించకపోవడంతో ఈ గొడవ పెరిగి పెద్దదైందని సమాచారం. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్‌పై టీడీపీ కార్యకర్త చెయ్యి చేసుకున్నాడని అర్థమవుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
టీడీపీకి దూరంగా ఎన్టీఆర్:
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ గురించి దేశవ్యాప్తంగా రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం స్పందించగా.. ఆ సమయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం పట్ల టీడీపీ కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. నిజానికి చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ విషయాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. అటు నందమూరి ఫ్యామిలీ రిలేటెడ్ విషయాలకు సైతం దూరంగా ఉంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సైతం జూనియర్ హాజరుకాలేదు. ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంగానూ జూనియర్ డుమ్మా కొట్టారు. ఇక ఇటీవలి జూనీయర్ ఎన్టీఆర్ ఫ్రెండ్, స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. తారక్ ఫ్రెండ్స్ అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీలోనే ఉన్న విషయం తెలిసిందే!
Also Read: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఎన్ని సినిమాలొస్తున్నాయంటే!
WATCH: