కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి కొద్ది రోజుల క్రితమే సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసాయి. ఇక వచ్చే నెలలో టీటీడీ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ సంవత్సరం స్వామి వారికి రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది అధిక మాసం రావడంతో స్వామి వారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు స్వామి వారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు స్వామి వారు దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్దమవుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం..అక్టోబర్ 15 నుంచి 23 వ తేదీ వరకు స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
అక్టోబర్ 15 ఆదివారం రాత్రి స్వామి వారు పెద్ద శేష వాహనం పై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వడంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 16 సోమవారం ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనం పై స్వామి వారు విహరిస్తారు. అక్టోబర్ 17 మంగళవారం ఉదయం సింహ వాహన సేవ, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవలు జరుగుతాయి.
అక్టోబర్ 18 బుధవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్ప వృక్ష వాహన సేవ, రాత్రి సమయంలో సర్వ భూపాల వాహనం పై స్వామి వారు భక్తులను కరుణిస్తారు. అక్టోబర్ 19 మోహినీ అవతారం. అదే రోజు రాత్రి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. అక్టోబర్ 20 హనుమ వాహనం, సాయంత్రం పుష్పక విమానం. రాత్రికి గజ వాహనం.
అక్టోబర్ 21 సూర్య ప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు నిర్వహిస్తారు. అక్టోబర్ 22 ఆదివారం ఉదయం స్వర్ణ రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం పై స్వామి వారు విహరిస్తారు. అక్టోబర్ 23 సోమవారం స్వామి వారికి చక్ర స్నానం జరుగుతుంది. దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.