Tiger: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్దపులులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా, కొమరం భీం జిల్లాలో పెద్దపులి హల్ చల్ చేస్తుండడంతో జనం వణికిపోతున్నారు. కాగజ్‌నగర్ మండలంలో పశువుల కాపరిపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటనలో అతడు గాయాలతో బయటపడ్డాడు.
వివరాల్లోకి వెళితే..నందిగూడకు చెందిన పశువుల కాపరి గులాబీ దాస్ రోజూ మాదిరిగానే మంగళవారం కూడా పశువులను తోలుకొని ఊరికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. సాయంత్రం తిరిగివస్తుండగా పెద్దపులి ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. గులాబ్ భయంతో గట్టిగా ‘పులి..పులి’ అని కేకలు వేయడంతో పెద్దపులి అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసింది. పంట చేలలో ఉన్న గ్రామస్తులు కేకలు విని హుటాహుటిన ఘటన స్ధలానికి చేరుకున్నారు. వెంటనే గాయపడిన పశువుల కాపరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also read: తెలంగాణలో పింఛన్ లు రూ.4 వేలకు పెంపు.. ఎప్పటినుంచంటే?
దాడి విషయం తెలుసుకున్న కాగజ్ నగర్ ఎఫ్ డీఓ వేణు, ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్ హాస్పిటల్ కు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ప్రజలెవరూ పులి ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లకూడదని హెచ్చరించారు. మహారాష్ట్ర తడోబా నుండి కాగజ్నగర్ డివిజన్లోని టైగర్ క్యారిడార్ లో మూడు నుండి నాలుగు పులులు తిరుగుతున్నాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
కాగా, గడిచిన 15 రోజుల్లో పులి సుమారు 20 పశువులపై దాడి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని పశువుల కాపరులు, గ్రామస్తులు మండిపడుతున్నారు.పెద్దపులి సంచారం కారణంగా స్థానిక గ్రామస్ధులు తీవ్ర ఆందోళనలో గురవుతున్నారు. పెద్దపులిని పట్టుకుని తమని కాపాడాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. మూడు సంవత్సరాలుగా ఏజెన్సీలో వరుస గా దాడులు చేస్తున్న పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసి రైతులు.