Congress Leaders Ticket War: కాంగ్రెస్ లో టికెట్ల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 119 స్థానాలకు గాను మొదటి లిస్టులో 55మంది, రెండో లిస్టులో 45మంది అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. తాజాగా కొత్తగూడెం నుంచి సీపీఐ(CPI) పోటీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటించన సంగతి తెలిసిందే. అయితే, మిగతా 18 స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే.. టికెట్ల విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య వివాదాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
ALSO READ: పడుకునే ముందు ఫోన్ వాడుతున్నారు?.. తస్మాత్ జాగ్రత్త!
రేవంత్ Vs పొంగులేటి.. నెగ్గేది ఎవరు?
రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల మధ్య తుంగతుర్తి టికెట్ చిచ్చు పెట్టిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తుంగతుర్తి టికెట్ అద్దంకి దయాకర్ కు కేటాయించాలని రేవంత్ రెడ్డి పట్టు పట్టగా.. లేదు తుంగతుర్తి టికెట్ ను పిడమర్తి రవికి ఇవ్వాలని పొంగులేటి పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మోత్కుపల్లి నర్సింహులుకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఇంకోవైపు సూర్యాపేటలో రేవంత్, పొంగులేటి ఇద్దరు పటేల్ రమేశ్ రెడ్డికి తమ మద్దతు ప్రకటించగా.. దామోదర్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి తమ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు సత్తుపల్లి టికెట్ ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొండూరు సుధాకర్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరగా.. రేణుకా చౌదరి మట్టా దయానంద్ భార్యకు ఇవ్వాలని హైకమాండ్ ను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవలే బీఆర్ఎస్(BRS) పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధుకు పటాన్ చెరు టికెట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నారట. మరో వైపు ఆ టికెట్ ను తన అనుచరుడు కాటా శ్రీనివాస్ గౌడ్ కు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా స్పష్టం చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి కాంగ్రెస్ అధిష్టానం వీరిలో ఎవరి వాదనకు మొగ్గుచూపుతుందో.. ఏ స్థానాల్లో ఎవరి అనుచరులకు టికెట్ కేటాయిస్తుందో తేలాలంటే మరో ఒకటి లేదా రెండు రోజులు ఆగాల్సిందే.
ALSO READ: కుదిరిన కాంగ్రెస్-సీపీఐ పొత్తు.. డీల్ ఇదే!