Minister Thummala Nageshwar Rao: తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అకాల వర్షాల వల్ల ఏర్పడిన పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసిన తర్వాత నష్టపరిహారాన్ని అందిస్తామని అన్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాలలో రాళ్ల వర్షాలు కురవడంతో పంట నీట మునిగింది.
రైతు బంధుపై..
తెలంగాణలో రైతులకు రైతు బంధు సాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు మూడు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేశామని తెలిపారు. రైతు బంధు నిరంతర ప్రక్రియ అని.. మార్చి నెలాఖరు అందరి ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు నిధులు మే వరకు రైతుల ఖాతాలో జమ చేసిందని గుర్తు చేశారు. వచ్చే పంట సీజన్ నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా నగదును జమ చేస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
రుణమాఫీపై..
తెలంగాణ రైతులకు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది అని చెప్పారు మంత్రి తుమ్మల. రైతు రుణమాఫీపై తమ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది అని పేర్కొన్నారు. ఏకకాలంలో రైతులను రుణమాఫీ చేసి వారి ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.