Thief Falls Asleep : సాధారణంగా దొంగలు అంటే కన్నం వేసే ఇంటి నుంచి దొంగతనం చేసిన కాసేపటికే తిరిగి వచ్చేస్తారు. అంతేకానీ అక్కడికి వారు వచ్చిన పని అయిపోగానే ఒక్క నిమిఫం కూడా ఉండరు. కానీ కొందరు దొంగలు ఉంటారు... మహనుభావులు.. దొంగతనానికి వెళ్లి వాళ్లు వచ్చింది అత్తాగారింటికి అనుకుంటారో ఏమో కానీ.. హాయిగా పడుకుంటారు.
తీరా సీన్ కట్ చేస్తే.. ఒళ్లంతా పచ్చడి అవుతుంది. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి ఇక్కడ జరిగింది. లక్నో (Lucknow) లోని ఇందిరా నగర్ సెక్టార్ 20లోని డాక్టర్ సునీల్ పాండే ఇంట్లోకి ఆదివారం తెల్లవారుజామున దొంగ ఇంటి తాళాలు పగలకొట్టి పాత్రలు, ఇతర వస్తువులను ప్యాక్ చేసి రెండు సంచుల్లో ప్యాక్ చేసుకున్నాడు.
Also Read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పి బోల్తాపడిన బస్సు..39 మంది ప్రయాణికులు!
ఆ తరువాత అక్కడ నుంచి వెళ్లిపోకుండా.. హాయిగా అక్కడే ఉండి ఏసీ, ఫ్యాన్ ఆన్ చేసి పడుకున్నాడు... ఈలోపు తెల్లారింది.. కళ్లు తెరచి చూస్తే ఇంకేముంది.. చుట్టూ ఇంటి ఓనర్లతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వికాస్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన దొంగను ముసద్దిపూర్ నివాసి కపిల్ కశ్యప్ గా గుర్తించారు. కపిల్ తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇన్వర్టర్ బ్యాటరీ, గీజర్, పాత్రలు, మరికొన్ని వస్తువులను రెండు బస్తాల్లో ప్యాక్ చేశాడు. ఆ వస్తువులను బస్తాల్లో ఉంచి అక్కడే సిగరెట్ తాగి నిద్రపోయాడు.
ఉదయం ఇరుగుపొరుగు వారు తాళం పగులగొట్టి ఉండడం చూసి ఇంటి యజమానికి సమాచారం అందించారు. ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్‌కి చెప్పాడు. పోలీసులు, వైద్యులతో పాటు కొందరు ఇరుగుపొరుగు వారు కూడా ఇంటి లోపలికి చేరుకున్నారు. అక్కడ కపిల్ నిద్రిస్తున్నట్లు గుర్తించారు. అతడిని మేల్కొలిపి అరెస్టు చేశారు. ఘటనా స్థలం నుంచి వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేసి ఐపీసీ సెక్షన్ 379 ఎ కింద దొంగతనం కేసు నమోదు చేశారు.
తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఘాజీపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వికాస్ రాయ్ తెలిపారు. కపిల్‌పై ఆరు దొంగతనం కేసులు నమోదైనట్లు ఏసీపీ వికాస్ కుమార్ జైస్వాల్ (Vikas Kumar Jaiswal) తెలిపారు. దొంగతనం కేసులో కొన్ని నెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు.