Demands Of BRS to Election Commission: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. కాగా ఎన్నికల సమయంలో కొంతమంది నేతలు అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతున్నారని..అలాంటి వారిని అదుపులో పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఈసీకి సూచించింది. అటు బీఆర్ఎస్ గుర్తు అయిన కారును పోలిన గుర్తులను ఉచిత గుర్తింపు జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల సంఘానికి విజ్నప్తి చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు తమ పార్టీ అన్నివిధాలా సహాకారం అందిస్తుదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ (B Vinod Kumar) ఈసీ అధికారులతో చెప్పారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ ఇతర ఉన్నతాధికారుల బృందం నిన్న (మంగళవారం) హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. హోటల్ తాజ్ కృష్ణాలో ఆ బృందం జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అయ్యింది. ఈ భేటీలో బీఆర్ఎస్ తరపున వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం వినోద్ కుమార్ మాట్లాడారు. బీఆర్ఎస్ కు కారు గుర్తును కేటాయించిన 2004 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో కారును పోలి ఉన్న గుర్తులకు వచ్చిన ఓట్ల వివరాలను అధికారులకు వివరించినట్లు తెలిపారు. గతంలో ఆటో , ట్రక్కు గుర్తులను 2011లో రోడ్డు రోలర్ గుర్తును తొలగించారని తెలిపారు. కారును పోలిన గుర్తులను జాబితా నుంచి తొలగించాలని ఈసీని కోరినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: మీ వాళ్లను తీసుకుపోండి..కెనడాకు భారత్ వార్నింగ్..!!
ఇక ఎన్నికల సమయంలో కొందరు నాయకులు, సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్స్ లో అసభ్యపదజాలంతో మాట్లాడుతున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అలాంటి వారికి చెక్ పెట్టాలని ఈసీని కోరినట్లు వినోద్ కుమార్ చెప్పారు. ప్రముఖుల కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు చెప్పారు. రానున్న ఎన్నికలు స్వేచ్చగా, ప్రశాంతంగా నిర్వహించాలని ఇందుకు తమ పార్టీ పూర్తిగా సహాకరిస్తుందని ఈసికి చెప్పినట్లు వినోద్ కుమార్ తెలిపారు. అటు ఎన్నికల ప్రచార సామగ్రి ధరలు అన్ని జిల్లాల్లో ఒకే విధంగా ఉండేలా చూడాలన్నారు. ధరలు పెరిగినందున అభ్యర్థుల ఎన్నికల ఖర్చును మరో 20లక్షలు పెంచాలని ఈసీ(EC)ని కోరినట్లు చెప్పారు.