Bjp : పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, హింసకు సంబంధించిన వార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌పై బీజేపీ, కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నిత్యం ఏదోక రూపంలో నిరసన తెలుపుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే బీజేపీ నాయకుడు కైలాష్ విజయవర్గియా సందేశ్‌ఖాలీ హింసపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బెంగాల్‌లో గూండాలు, పోలీసులు, రాజకీయ నాయకుల మధ్య బలమైన అనుబంధం ఉందని ఆయన ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఉందా?
జబల్‌పూర్‌లో విలేకరులతో కైలాష్ విజయవర్గియా మాట్లాడుతూ, చిన్న చిన్న సంఘటనలకు ప్రజలు ఢిల్లీలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేస్తున్న వారంతా కూడా సందేశ్‌ఖాలీని సందర్శించి, పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఉందో లేదో తనిఖీ చేయాలని అన్నారు. సందేశ్‌ఖాలీలో స్థానిక ప్రజల హక్కులకు భంగం కలిగిందన్నారు. స్థానికుల వద్ద భూమి లీజు పత్రాలు ఉన్నాయని, అయితే భూమి వారి ఆధీనంలో లేదన్నారు. ప్రధాన మంత్రి అన్న యోజన కింద ఆహార ధాన్యాలు పొందే హక్కు వారికి ఉంది, కానీ వారికి రేషన్ అందడం లేదు అంటూ ఆరోపించారు.
షాజహాన్ షేక్ గురించి
సందేశ్‌ఖాలీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ గురించి బీజేపీ నేత కైలాష్ విజయవర్గియా ప్రస్తావించారు. సందేశ్ ఖాలీలో ఈ నిందితుడు ఇంతకు ముందు బీజేపీ మండల అధ్యక్షున్ని ఆలయంలో కాల్చి చంపాడు. ఈ ఘటన జరిగి ఏడాది గడిచినప్పటికీ పోలీసులు మాత్రం నిందితున్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు.
ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగగా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడైన షాజహాన్ షేక్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేవలం అనుమానం మాత్రమే ఉందని నిందితున్ని నిర్దోషిగా విడుదల చేవారు. ఈ ఒక్క ఘటన చాలు గూండాలు, పోలీసులు, రాజకీయ నాయకుల మధ్య అనుబంధాన్ని స్పష్టంగా చూపించడానికి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి పాలన
పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్‌పై విజయవర్గీయ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం నియమాలు, విధానాలను అనుసరిస్తుందని అన్నారు. గవర్నర్ నివేదిక సమర్పించి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కైలాష్ విజయవర్గీయ మాట్లాడుతూ బీజేపీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నందున ఆర్టికల్ 356 (రాష్ట్రపతి పాలన)ను ఇప్పటి వరకు ఉపయోగించలేదని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదని విజయవర్గీయ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలనేది నా అభిప్రాయం. ఇది బీజేపీ ఆలోచన కాదని స్పష్టం చేశారు.
Also read: పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్!