ప్రజలు విశ్వాసం కోల్పోయిన నాయకులపై వేటు: మంత్రి కేటీఆర్‌

హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని, అది తమ సంస్కృతి కాదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం తెస్తున్న అప్పులపై మాట్లాడుతూ వాటితో సంపద సృష్టి కూడా జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కుటుంబ పెద్దలాంటి సీఎం కేసీఆర్‌.. ఎమ్మెల్యేలు, ఎంపీలను పద్ధతి మార్చుకోమంటే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. పనితీరే ఎజెండాగానే వచ్చే ఎన్నికల్లో ఓట్లేయమని అడుగుతామని స్పష్టం చేశారు కేటీఆర్

New Update
ప్రజలు విశ్వాసం కోల్పోయిన నాయకులపై వేటు: మంత్రి కేటీఆర్‌

There is no need to do murderous politics

ఈటల నాకు పెద్దన్న. రాజకీయంగా ఆయన వేరే పార్టీలో ఉండొచ్చు. ఆయననుచంపేందుకు సుపారీ ఇచ్చారనేది పూర్తిగా అవాస్తవం. ఇన్నేండ్ల బీఆర్‌ఎస్‌ రాజకీయంలో అలాంటి చిల్లర రాజకీయాలు, సుపారీ రాజకీయాలు, హత్యా రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్నాం. అది మా సంస్కృతి కాదు. అలాంటి ప్రమాదమే ఉంటే మేమే ఆయనకు పటిష్టమైన భద్రత కల్పిస్తాం. అవసరమైతే ఆయనకు సెక్యూరిటీ పెంచమని డీజీపీకి చెప్తాం. ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటా. ప్రజాక్షేత్రంలో ఈటల రాజేందర్‌ అయినా, రేవంత్‌రెడ్డి అయినా ఎవర్నైనా ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుతోనే వారిని ఓడిస్తాం. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయమని కేటీఆర్ అన్నారు.

రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్లలోనే పోటీ

రాష్ట్రానికి మంచి నాయకత్వం అందిస్తాం, జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం అని తొమ్మిదేండ్ల కిందట చెప్పాం. అదే చేస్తున్నాం. ఈ తొమ్మిదేండ్లలో అనేక మంది బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇందులో తెలంగాణను వ్యతిరేకించినవాళ్లు కూడా ఉన్నారు. కాదనడం లేదు. అయితే ఇదే సమయంలో ఉద్యమకారులనూ కాపాడుకొన్నాం, వీళ్లను కాపాడుకున్నాం. టికెట్లు రాని ఒకరిద్దరు నేతలు వాళ్ల బాధను ప్రజల బాధ అని, వారి స్వీయ మానసిక ఆందోళనను ప్రజలదిగా చూపుతూ, గొంతు చించుకుంటున్నారు. ప్రజలకు ఏం కష్టం ఉన్నది? ఎర్రటి ఎండల్లో దుంకుతున్న మత్తళ్లు, చెరువుల నిండా మీన రాశులు, వెనక్కి వస్తున్న వలసలు, ఇంటింటికీ చేరుతున్న మంచినీళ్లు, టింగ్‌టింగ్‌మంటూ పడుతున్న రైతుబంధు, రైతుల ఖాతాల్లో చేరిన రూ.73వేల కోట్లు కనిపించడం లేదా? రాష్ట్రాలకు ఐఏఎస్‌ అధికారులను యూపీఎస్సీ కేటాయిస్తుందనే కనీస అవగాహన లేకుండా బీహారీల రాజ్యం అంటూ విమర్శలు చేయడం సిగ్గుచేటు. 140 కోట్ల మంది ఉన్న దేశానికి ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తిని అధ్యక్షురాలిని చేసిన పార్టీ కూడా మాకు చెప్తుందా? మేం ప్రజలను నమ్ముకొని రాజకీయం చేస్తాం. సీఎం కేసీఆర్‌ ఆదేశిస్తే.. నాకు రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్లలోనే ఈసారి కూడా పోటీ చేస్తా. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉండటాన్ని గౌరవంగా భావిస్తా.

బెస్ట్‌ సిటీగా హైదరాబాద్‌

హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ప్రణాళికలో దశలవారీగా ముందుకు వెళ్తున్నాం. భూతల స్వర్గంగా మార్చామని చెప్పడం లేదు కానీ దేశంలోనే బెస్ట్‌ సిటీగా మార్చాం. మర్సర్‌ సంస్థ 2015 నుంచి 2020 వరకు వరుసగా ఐదేండ్లపాటు దేశంలోనే అత్యుత్తమ పట్టణంగా హైదరాబాద్‌కు అవార్డు ఇచ్చింది. ఇటీవలే గ్రీన్‌ సిటీ అవార్డు రావడమే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్‌ కన్నా మెరుగైన నగరం దేశంలో ఒక్కటి ఉన్నా చూపించాలి. ప్రజల సౌకర్యాల మెరుగుకు 150 డివిజన్లలో వార్డు ఆఫీసులు, బస్తీ దవాఖానలు, అన్నపూర్ణ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఫ్లైవోవర్లు, అండర్‌పాస్‌లు కట్టి ట్రాఫిక్‌ రద్దీ తగ్గించాం. ప్రతి ఇంటికి మంచినీళ్లు, 24 గంటల కరెంటు అందుతున్నది. ఎఫ్‌ఎస్‌ఐ షరతులను 2005-06లో ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. దాన్ని మేము కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో వచ్చే ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 250 కిలోమీటర్లు పెంచాలని నిధుల కోసం ఢిల్లీ వెళ్తే రాజకీయాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో వరద నీటి కాల్వల కోసం మేం వెయ్యి కోట్లు పెట్టాం. మీరొక రూ.300 కోట్లు ఇవ్వమని అడిగాం. ప్రభుత్వంగా మేము ప్రజల కోసం అడిగాలి కదా. దానిపైనా రాజకీయం చేయడం మంచిదికాదు.

డబుల్‌ బెడ్రూం సక్సెస్

డబుల్‌ బెడ్రూం అనే కార్యక్రమం తెలంగాణలో గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. ఈ దేశంలో పేదల కోసం కేసీఆర్‌ తప్ప.. డబుల్‌ బెడ్రూం కట్టిన మొగోడు ఎవ్వడు? ఎవరైనా ఉంటే చూపెట్టండి. ఇలాంటి ఆలోచన వచ్చినవారెవరైనా ఉన్నారా? ఇండ్లు కట్టడం అంటే పిట్టగూడు కట్టినట్టు కాదు. రెండు పడకగదులు, ఒక కిచెన్‌, ఒక హాలుతో ఇల్లు కట్టివ్వడం కేసీఆర్‌కే సాధ్యమైంది. కేంద్రం మొండిచేయి చూపడం, ఆర్థిక ఆంక్షలు పెట్టి, కరోనా రావడం వల్ల పేదలకు ఇండ్లు ఇవ్వడానికి కొంత ఆలస్యం కావొచ్చు. ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నాం. ఇట్లాంటి మంచిపనులు ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటాం. ఇందులో తప్పేముంది? ఫ్లైవోవర్లు కట్టామని చెబితే తప్పా..? రాష్ట్ర ఆదాయం పెంచామని చెబితే తప్పా? ఉద్యోగాలు సృష్టించామని చెబితే తప్పా? మిగతా వాళ్లలా అది రద్దు చేస్తం.. ఇది బంద్‌ చేస్తాం అని చెప్పం. చేసిందే చెప్పుకుంటాం.

రుణమాఫీలో ఆలస్యం వాస్తవం

2 సంవత్సరాల పాటు 50వేల వరకు రుణమాఫీ చేశాం. రెండేండ్ల పాటు కొవిడ్‌ వల్ల లక్ష కోట్లు నష్టపోయాం. కాబట్టి రైతురుణ మాఫీ విషయంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. కానీ రూ. 75 వేలకోట్లు 70లక్షల రైతుల ఖాతాల్లో రైతుబంధు రూపంలో జమ చేసిన మాట వాస్తవం కాదా. ఇలా ఈ దేశంలో ఎవరైనా జమచేశారా? రుణమాఫీ కన్నా రైతు బంధు రూపంలో డబ్బుల రాలేదా? రుణమాఫీ చేసేందుకు పరిష్కారాలు వెతుకుతున్నాం. లక్ష కోట్టు నష్టపోయిన రాష్ట్రం 75 వేల కోట్లు జమచేసిన విషయాన్ని ఎట్లా మరిచిపోతరు. రుణమాఫీ చేయలేదని ఎట్లా అడుగుతరు. రైతులు అమాయకులేం కాదు. ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమాను అందించిన  సీఎం కేసీఆర్‌ను రైతులు తప్పకుండా కడుపుల పెట్టుకుంటరనే నమ్మకం మాకు ఉందన్నారు మంత్రి కేటీఆర్.

Advertisment
Advertisment
తాజా కథనాలు