నిలకడగా ధవళేశ్వరం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ధవళేశ్వరంప్రాజెక్టు వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా ఉంది. (శనివారం) జూలై 22 నాటికి నీటిమట్టం తగ్గుముఖం పట్టిన గోదావరి.. ప్రాజెక్టులోకి వస్తున్నవరద జలాలను దిగువకు విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద 10.40 అడుగులకు నీటిమట్టం చేరుకోగా.. 7 లక్షల 96 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడుదల చేశారు అధికారులు. కాటన్ బ్యారేజ్ వద్ద 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇంకా గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ హెచ్చరించారు. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
అప్రమత్తంగా ఉండాలి
అంతేకాకుండా నిన్న స్పిల్‌వే ఎగువన 32.000 మీటర్లు, దిగువన 23.500 మీటర్లు, కాపర్ డ్యాం ఎగువన 32.700 మీటర్లు, దిగువన 23.070 మీటర్లు, పోలవరం గ్రామం వద్ద 22.517 మీటర్ల నీటిమట్టం నమోదైంది. భద్రాచలం వద్ద గోదావరి కొంత శాంతించినా, మళ్లీ నెమ్మదిగా పెరుగుతుండటంతో కుక్కునూరు, వేలేరుపాడు గ్రామ వాసులను ముంపు భయం వెంటాడుతోంది. ఆచంట, యలమంచిలి మండలాల్లో గోదావరి నిలకడగా ఉంది. యలమంచిలి మండలం కనకాయలంక కాజ్‌వే నీటిలోనే నానుతోంది. వశిష్ఠా గోదావరికి వరద పోటు తగ్గలేదు. జూలైన 22న ఎగువ నుంచి 2.2లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో నరసాపురం వద్ద గోదావరి పరవళ్లు తొక్కింది. వరద తగ్గే వరకు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రాకపోకలకు ఇబ్బంది ఉండదు
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ఆనకట్ట వద్ద నీటిమట్టం 11.5 అడుగులకు చేరగా.. 9.45 లక్షల క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అయితే ఈ సాయంత్రానికి వరద మరింతగా తగ్గుతుందని అధికారులు అంచన వేస్తున్నారు. వరద కారణంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని బూరుగుల్లంక, జి.పెదపూడి లంక, అరిగలవారిపేట, ఊడిమూడి లంక తదితర లంక గ్రామాల ప్రజలు మర పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఐ.పోలవరం మండలంలోని జి.మూలపాలెం, కాట్రేనికోన మండలం రామాయంపేట రేవులో వంతెన లేకపోవడంతో నాటుపడవల్లోనే స్థానికులు రాకపోకలు కొసాగిస్తున్నారు.
ఆలయం మూసివేత
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలో గోదావరి ఉద్ధృతి గంట గంటకు పెరుగుతోంది. గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. వరద ప్రవాహం పెరగటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత ఏడాది ఇదే సమయంలో కూనవరం, చింతూరు, దేవీపట్నం మండలాల్లోని గ్రామాలు వరదలకు.. నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు దేవిపట్నంలోని గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండలకు బయల్దేరే బోట్లను నిలిపివేశారు. దేవిపట్నంలోని గండి పోచమ్మ అమ్మవారి ఆలయంలోకి నీరు చేరటంతో ఆలయాన్ని అధికారులు మూసివేశారు.
తుఫాన్ హెచ్చరిక
వాయువ్య బంగాళాఖాతంలో జూలై 22 (శనివారం) ఏర్పడ్డ అల్పపీడనం రెండు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఈనెల 28 వరకు రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు కొనసాగుతాయని.. తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున ఈనెల 26వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.