అతి ముఖ్యమైన ఈ అంశంపై ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయకుండా మౌనంగా ఉంటున్నారని వారు ఆరోపించారు. ;ఇండియా'.. 'ఇండియా'.. 'మోడీ.. కుచ్ తో బోలో' అని ప్రతిపక్ష ఎంపీలు సభా కార్యకలాపాలను స్తంభింపజేశారు. నిజానికి విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చకు పార్టీ నేతలందరితోనూ చర్చించి ఓ తేదీని, సమయాన్ని తాను నిర్ణయిస్తానని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా హామీ ఇచ్చినప్పటికీ.. విపక్షాలు శాంతించలేదు. ప్రధానంగా మణిపూర్ హింసపై కేంద్రం ఉదాసీనంగా ఉంటోందని, సభలో దీనిపై చర్చ జరగాలని వారు పట్టుబడుతున్నారు. వీరి రభసతో గురువారం ఉభయసభలూ మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడ్డాయి.
మా నేత మైక్ కట్ చేస్తారా ? చిదంబరం ఆగ్రహం
విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఓ వైపు విదేశీ పాలసీపై మాట్లాడుతుండగానే విపక్ష ఎంపీల రభస కారణంగా సభ వాయిదా పడింది. పైగా మంగళవారం నాడు కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతుండగా ఆయన మైక్ ని కట్ చేశారంటూ ఈ రోజు విపక్ష ఎంపీలు రాజ్యసభలో రభస సృష్టించారు. ఈ నెల 20 న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజు కూడా మణిపూర్ అంశంపై చర్చ జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఆరోపించారు. ఓ వైపు ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నా ఫారెస్ట్ కన్సర్వేషన్ (సవరణ) బిల్లు -2023 ను సభ ఆమోదించేలా చూడడంలో కేంద్రం సఫలీకృతమైంది. లోక్ సభలో సుమారు అరగంట చర్చ తరువాత దీనికి ఆమోద ముద్ర పడింది. అలాగే సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాక రాజ్యసభలో కాన్స్టి ట్యూషన్ (షెడ్యూల్డ్ ట్రైబ్) ఆర్డర్ (థర్డ్ అమెండ్మెంట్) బిల్లు-2022 ను మూజువాణీ ఓటుతో సభ ఆమోదించింది.
జైశంకర్ తీవ్ర అసహనం
రాజ్యసభలో విపక్షాలు వ్యవహరించిన తీరు పట్ల విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. మన దేశంలో మనం దేని గురించి అయినా చర్చించ వచ్చునని, కానీ దేశం బయట మాత్రం మనం మన సమైక్యతను చూపాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ ప్రయోజనాల విషయం వచ్చేసరికి మన రాజకీయాలను పక్కనబెట్టవలసి ఉందని, ముఖ్యమైన అంశాలపై చర్చించవలసి ఉందని ఆయన చెప్పారు.
మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా
మణిపూర్ సమస్యపై విపక్షాలు తమ పట్టును వీడక పోవడంతో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ కర్ మధ్యాహ్నం 2 గంటలవరకు సభలను వాయిదా వేశారు. మీరు నల్ల దుస్తులు ధరించి వచ్చారని, అందువల్లే మీ భవిష్యత్తు కూడా నల్లగా ఉంటుందని మంత్రి పీయూష్ గోయెల్.. విపక్ష సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.