BJP Defeat: మోదీ మేనియా.. బీసీ కార్డు కూడా పనిచేయలేదు.. బీజేపీ పరాభవానికి కారణాలివే!

తెలంగాణలో బీజేపీ చతికిల పడింది. ప్రధాని మోదీతో సహా అగ్రనాయకులంతా గిరా గిరా తిరిగినా.. ఫలితం లేకపోయింది. ఓటర్లు చాలా లైట్ తీసుకున్నారు. ఎందుకు బీజేపీకి అనుకున్న ఫలితాలు రాలేదు? ఈ కథనంలో తెలుసుకోండి. 

BJP Defeat: మోదీ మేనియా.. బీసీ కార్డు కూడా పనిచేయలేదు.. బీజేపీ పరాభవానికి కారణాలివే!
New Update

BJP Defeat: ఏదైనా పోటీలో గెలవాలి అని అనుకోవడం వేరు.. గెలవడం కోసం సర్వశక్తులు వినియోగించడం వేరు. అందులోనూ ఎన్నికల్లో గెలవాలి అంటే ఉండాల్సిన కసి వేరు. మేము గెలుస్తాం.. మేమే గెలుస్తాం అని జబ్బలు చరిస్తే ఓటర్లు ఒప్పుకోరు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అప్రతిహత విజయాల్ని సాధించిన బీజేపీ.. తెలంగాణాలో చతికిల పడింది. ప్రధాని మోదీ మొదలుకుని పార్టీ అగ్రనాయకులంతా తెలంగాణలో గిరాగిరా తిరిగేశారు. ఏకంగా నాలుగురోజుల పాటు ప్రధాని మోదీ ఇక్కడ ప్రచారం చేశారు. కానీ.. ఆ స్థాయిలో ఫలితాలు రాబట్టుకోలేకపోయారు. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఎన్నికల్లో ప్రతి గెలుపు.. ఓటమికి చాలా ముందుగానే బీజం పడుతుంది. బీజేపీకి ఓటమికి బీజం కూడా చాలా కాలం క్రితమే పడింది. అది బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తప్పించి కిషన్ రెడ్డిని ఆ స్థానంలో కూర్చోపెట్టడం. ఎగ్రసివ్ పాలిటిక్స్ తో తెలంగాణ వ్యాప్తంగా ఒక ఇమేజ్ సృష్టించుకుని.. బీఆరెస్ నాయకుల్ని కుదురుగా ఉండనీయకుండా పనిచేసిన బండి సంజయ్ ను తప్పించడం పెద్ద దెబ్బ. అదే సమయంలో మృదు స్వభావి.. కేసీఆర్ తో సత్సంబంధాలు ఉన్నాయనే అంచనాలు ఉన్న కిషన్ రెడ్డిని చీఫ్ చేయడంతో మొదలైంది బీజేపీ పతనం. 

ఇక ఎమ్మెల్సీ కవిత విషయంలో పిల్లిమొగ్గలు కూడా బీజేపీ పరాభవానికి(BJP Defeat) మెట్లుగా మారాయి. లిక్కర్ కుంభకోణంలో మామూలుగా ఉండదు అంటూ బెదిరిస్తూ.. మీడియాకి లీక్స్ ఇస్తూ.. ఇదిగో అరెస్ట్.. అదిగో అరెస్ట్ అని చెబుతూ.. చివరికి ఏమీ చేయకుండా సైలెంట్ అవడం ప్రజల్లో నెగెటివిటీని తీసుకువచ్చింది. కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతూ వచ్చిన బీఆర్ఎస్.. బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే అనే మాటను ప్రజలు బాగా నమ్మారు. కాదు.. కాదు.. నమ్మేలా చేశారు బీజేపీ పెద్దలు. 

బీజేపీ(BJP Defeat) మిగిలిన రాష్ట్రాల్లో వ్యూహాలకు.. తెలంగాణలో వ్యవహారాలకు చాలా తేడా ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో అక్కడి స్థానిక నాయకత్వం బలంగా ఉండేలా చూసుకుంది. ఇక్కడ మాత్రం ప్రతి విషయమూ కేంద్రమే అనేలా పరిస్థితి వచ్చింది. దీనికి చిన్న ఉదాహరణ బీసీ ముఖ్యమంత్రి హామీ. ఇక్కడ ఉన్న నాయకులు ఎవ్వరూ ఈ విషయంలో సరైన ప్రచారం చేయలేకపోయారు. అసలు ఈ హామీ ప్రకటించింది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాలుగైదు రోజుల తరువాత. అదీ కూడా ప్రధాని మోదీ ప్రచార సభలో ప్రకటించారు. అప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కేంద్ర పెద్దలపై ఎక్కువగా ఆధారపడి నడుచుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ప్రచారం విషయంలో ఎవరికి వారు ప్లాన్ చేసుకుని పధ్ధతి ప్రకారం పోయారు. అది బీజేపీకి కుదరలేదు. 

ఇక స్థానిక నాయకులు అంటే రాష్ట్ర అగ్రనాయకులుగా చెప్పుకునే కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశేవేశ్వర రెడ్డి, జితేంద్ర రెడ్డి వంటి నాయకులు అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అదే బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో ఎంపీలను కూడా పోటీలో దింపింది. ఆ పని ఇక్కడ చేయలేకపోయింది. దాంతో ప్రజలు కూడా బీజేపీని లైట్ తీసుకున్నారు. స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే పోటీలో లేకుండా ఉంటే.. ఓటరు ఎవరిని చూసి ఓటు వేస్తాడు? దానికి తోడు.. బీఆర్ఎస్ చేసిన ఢిల్లీ నుంచి వచ్చినోడికి మన బాధలు ఏమి తెలుస్తాయిరా? అనే ప్రచారం బాగా వర్కౌట్ అయింది. అది కాంగ్రెస్ ను కూడా ఉద్దేశించి చేసినా.. ఇక్కడ స్థానికంగా రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీ చేశారు. నేరుగా కేసీఆర్ మీద సై  అన్నారు. ఆ దూకుడులో పదోవంతు కూడా ఇక్కడ బీజేపీ నాయకులు చూపించలేకపోయారు. 

ఇవన్నీ పక్కన పెడితే.. బీసీ ముఖ్యమంత్రి అనే ప్రకటన బూమరాంగ్ అయింది. ఎందుకంటే.. కేవలం పార్టీ అధ్యక్ష పదవినే బీసీ వ్యక్తి నుంచి లాక్కుని.. రెడ్డి సామాజిక వర్గానికి కట్టపెట్టిన బీజేపీ అధిష్టానం గెలిస్తే మాత్రం ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఏమి ఇస్తుంది అనే నెగెటివ్ ప్రచారం పాకిపోయింది. 

Also Read: తెలంగాణలో దుమ్ములేపిన కాంగ్రెస్.. గెలుపుకు 12 ముఖ్య కారణాలివే

ఇక ఒక పక్క బీఆర్ఎస్ గెలుపు గుర్రాలంటూ చాలా ముందుగానే అభ్యర్ధులను ప్రకటించుకుంటూ పోతుంటే.. చివరి నిమిషం వరకూ అభ్యర్థులను అటూ ఇటూ మారుస్తూ పోయింది బీజేపీ. అదే సమయంలో వివేక్ వెంకట స్వామి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి వంటి నాయకులు పార్టీ వదిలి పోతున్నా కూడా అడ్డుకోలేకపోయింది సరికదా.. కనీసం బయటకు వెళ్లిన తరువాత వారు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే పరిస్థితి కూడా స్థానిక నాయకులకు గానీ.. కేంద్ర నాయకులకు గానీ లేకుండా పోయింది. 

ఇవన్నీ ఇలా ఉంటే అన్నిటికన్నా పెద్ద డేమేజ్.. బీఆర్ఎస్ - బీజేపీ(BJP Defeat) రెండూ ఒకటే అనే ప్రచారం. బీజేపీకి కాంగ్రెస్ ఓడిపోవడమే కావాలి.. ఆ క్రమంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు అనే విధంగా బీజేపీ శైలి తెలంగాణలో ఉంది. ముక్కోణపు పోటీ ఉన్నపుడు.. ఓటర్లను తమవైపు తిప్పుకోవాలి అనుకున్నపుడు.. అధికార పార్టీ తీరుతెన్నులను ఎండగట్టే పని గట్టిగా ఉండాలి. ఆ విషయంలో కాంగ్రెస్ తీరు సరిగానే ఉంది. కానీ, బీజేపీ మాత్రం అసలు అటువంటి దూకుడు ప్రచారం ఏదీ చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లీకేజ్ కానీ.. పేపర్ల లీకేజ్ కానీ ఎక్కడా పెద్దగా ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకోలేదు. అలానే, ప్రధాని మోదీతో సహా కేంద్ర నాయకులంతా  వచ్చారు.. నాలుగు మాటలు చెప్పారు.. వెళ్లారు.. కానీ, తరువాత కనీసం వాళ్ళు మాట్లాడిన అంశాలను కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయగలిగే గట్టి నాయకుడు ఎవరూ లేకపోవడం నిజంగా బీజేపీ లాంటి పెద్ద పార్టీ దౌర్భాగ్యం అనే చెప్పాలి. కిషన్ రెడ్డి కేంద్ర నాయకులూ వచ్చిన సమయంలో బాగా మెరిశారు. కానీ.. హైదరాబాద్ దాటి ఇంకా  ఎక్కడా ప్రచారంలో కనిపించలేదు. వినిపించలేదు. అసలు రాష్ట్ర స్థాయి ఎన్నికలకు రాష్ట్రస్థాయిలో ఒక పెద్ద నాయకుడు అని చెప్పుకునే వారే బీజేపీకి లేరు. కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి.. ప్రజల్లో కేసీఆర్.. బీజేపీ దోస్తీలు అనే విషయానికి ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రచార విధానం మరింత ఊతం ఇచ్చింది అనేది నిస్సందేహం. అయితే, ఇక్కడ బీజేపీకి ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. బండి సంజయ్, ఈటెల రాజేందర్ వంటి వారు ఓడిపోయినా సరే.. గతంలో కంటే కొద్దిగా ఎక్కువ సీట్లు దక్కడం. ఏది ఏమైనా దక్షిణాదిలో పాగా వేయాలంటే.. కోరిక ఒక్కటీ సరిపోదు.. సరైన నాయకత్వము ఉండాలనేది బీజేపీ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. 

Watch this interesting Video:

#bjp #telangana-election-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe