Medaram : మేడారం మహాజాతర మూడోరోజు అత్యంత వైభవంగా సాగుతోంది. భక్తకోటి జయజయధ్వానాల మధ్య మేడారం మారుమోగుతోంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో కిటకిటలాడింది. కన్నెపల్లి నుంచి సారలమ్మను ఆదివాసీపూజారులు డోలు, వాయిద్యాలతో తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు పూజారులు. రెండో రోజు మేడారం గద్దె మీదికి సమ్మక్క చేరుకుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను వనం వీడి జనం మధ్యలోకి తీసుకువచ్చారు. సమ్మక్క రాకతో మేడారం పరిసరాలు మారుమోగాయి. భక్తులు జై సమ్మక్క అంటూ భక్తిని చాటుకున్నారు.
గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, పసుపు, కుంకుమలు, గాజులు, చీరసారె వనదేవతులకు సమర్పించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. మేడారంలో జంపన్న వాగు, చిలకలగుట్ట, నార్లపూర్ ప్రాంతాల్లో చెట్ల కింద విడిది చేస్తున్నారు. ఈసారి భక్తులు భారీగా తరలివస్తున్నాయి.
ఇక అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత భక్తులు కోళ్లు,మేకలను అమ్మవార్ల ముందు కట్ చేసి మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో మేడారంలో కోళ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. బుధవారం, గురువారంలో లైవ్ కిలో కోడి ధర రూ. 150 నుంచి 200 ఉండగా శుక్రవారం ఏకంగా రూ. 500కు పెరిగింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో చాలా దుకాణాల్లో కోళ్లు అయిపోవడం,సరఫరా నిలిచిపోవడంతో విక్రేతలు ధరలను ఒక్కసారిగా పెంచేశారు. ఇక కోళ్లు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది మటన్ కొంటున్నారు. దీంతో ఆ దుకాణాల దగ్గర కూడా రద్దీ నెలకొంది.
ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో గూగుల్ పే బంద్..మరి మన సంగతేంటి ? మన డబ్బు సేఫేనా?