Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నక్సల్స్ అలజడి వినిపించిందనే సమాచారంతో అడవినంత జల్లెడపడుతున్న పోలీసులు పలు ప్రాంతాల్లో మావోయిస్టులకు సంబంధించిన అమరవీరుల స్మారక చిహ్నాలను కూల్చేస్తున్నారు. ఇందులో భాగంగానే నారాయణపూర్, కస్తూర్‌మెటాలోని ఇక్‌పాడ్ ప్రాంతంలో 53వ బెటాలియన్ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఓ పురాతన స్మారక స్థూపాన్ని ధ్వంసం చేయగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
13 మంది మృతి..
ఈ మేరకు ఇటీవల తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఇదే క్రమంలో ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సుక్మా, బీజాపూర్ జిల్లాలో 12 మంది నక్సలైట్లను సోమవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.