T20 World Cup : 2024 జూన్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్(World Cup) కోసం భారత టీమ్(India Team) తుది జట్టుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే భారత కోచ్ రాహుల్ ద్రావిడ్(Rahul Dravid), సెలక్టర్లు తమ ప్రణాళికలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టోర్నమెంట్ కు ముందు అఫ్గానిస్థాన్ తో చివరి టీ20 సిరీస్ ఆడుతుండగా దాదాపు రెండేళ్ల తర్వాత విరాట్, రోహిత్ లు టీ20 జట్టులోకి వచ్చారు. అయితే వరల్డ్ కప్ కోసం ఇండియా టీమ్ సెలెక్షన్ గురించి పలువురు లెజెండ్స్ తమ అభిప్రాయాలు వెల్లడించగా తాజాగా టీమ్ ఇండియా మాజీ ఆటగాడు, సెలెక్టర్ దీప్ దాస్ గుప్తా(Deep Das Gupta) కూడా జట్టుకూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వీరిద్దరు రాణిస్తారు..
ఈ మేరకు త్వరలో జరగబోయే ఐపీఎల్(IPL) 2024 సీజన్ తో సంబంధం లేకుండానే టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్ దాదాపు ఖరారు అయిపోయినట్లు తెలుస్తోందని దీప్ దాస్ గుప్తా అభిప్రాయపడ్డారు. అంతేకాదు వరల్డ్ కప్ లో విరాట్(Virat), రోహిత్ (Rohit) లపై భారీ అంచనాలు ఉంటాయని, విదేశీ పిచ్‌లపై వీరిద్దరు రాణించగలరన్నారు. యువకులతో పోటీపడి రన్స్ చేయడంలో వీరిద్దరూ ఎల్లప్పుడూ ముందుంటారని, వారి అనుభవం జట్టుకు చాలా ఉపయోగపడుతుందన్నారు.
ఇది కూడా చదవండి: Prof. Kodandaram: అలా చేసినందుకే బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది: ప్రొ. కోదండరాం
95 శాతం ఫైనల్..
‘అందరూ IPL 2024లో ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా భారత సెలెక్టర్ T20 ప్రపంచ కప్ 2024 కోసం జట్టును ఖరారు చేస్తారని అనుకుంటున్నారు. కానీ T20 ప్రపంచ కప్ 2024 కోసం జట్టు 90–95 శాతం ఫైనల్ అయింది. ఐపీఎల్ 2024లో కోహ్లీ 500+ పరుగులు చేస్తాడు. అయితే రోహిత్ ఫామ్ గురించి ఖచ్చితంగా తెలియదు. అతను చెలరేగితే బౌలర్లు తలలు పట్టుకోవాల్సిందే. ఈసారి వరల్డ్ కప్ ఇండియాకు చాలా ముఖ్యమైనది‘ అని ాయన అన్నారు.
రోహిత్ కు చివరిది..
అలాగే ‘ఈ సీజన్‌లో రోహిత్‌ను చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే అతను ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించడం లేదు. కాబట్టి ఇది రోహిత్‌కు భిన్నమైన పాత్ర అవుతుంది. మరో ముఖ్యమైన విషయం కెప్టెన్సీ.. ఈ ఫార్మాట్ కు కెప్టెన్సీ ఆధారితమైనది. ప్రపంచకప్‌లో రోహిత్ నాయకత్వం వహిస్తాడంలో సందేహం లేదు. ఎందుకంటే ప్రస్తుతం అతన్ని కాదని మరొకరికి పగ్గాలు ఇచ్చే అవకాశమే లేదు. ఈ వరల్డ్ కప్ రోహిత్ కు చివరిది కూడా కావొచ్చు’ అని తన మనసులో మాట బయటపెట్టారు.
ఇక T20 వరల్డ్ కప్ పిచ్‌ల గురించి మాట్లాడుతూ.. ‘నిజంగా చెప్పాలంటే.. సాధారణంగా వెస్టిండీస్(West Indies)లోని పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలమైనవి కావు. 160-170 స్కోర్ చేస్తే మ్యాచ్ నిలబెట్టుకోవచ్చు’ అని ఆయన సూచించారు.