Robot Dogs: రోబో కుక్కల కళ్లు చెదిరే డ్యాన్స్!

ఒకప్పుడు రోబోల పేరు చెప్పగానే అడుగులో అడుగు వేసుకుంటూ కదిలే మర యంత్రాలే గుర్తొచ్చేవి.కానీ ఇక్కడ ఈ రోబోలు డ్యాన్స్ కూడా చేస్తున్నాయి.అవి ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాయో తెలుసుకోండి..

New Update
Robot Dogs: రోబో కుక్కల కళ్లు చెదిరే డ్యాన్స్!

Robot Dogs Dance Viral On Social Media: ఒకప్పుడు రోబోల పేరు చెప్పగానే అడుగులో అడుగు వేసుకుంటూ కదిలే మర యంత్రాలే గుర్తొచ్చేవి. అవి నిలబడటం, కూర్చోవడం లాంటి టాస్క్ లు చేయడం కూడా కష్టంగా ఉండేది. మరి ఇప్పుడు.. కాలం మారినట్లే టెక్నాలజీ కూడా మారిపోయింది. అందుకే ఏకంగా డ్యాన్స్ చేసే రోబోలు కూడా వచ్చేశాయి. అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ (Boston Dynamics) అనే కంపెనీ కుక్కల ఆకారంలో తయారు చేసిన రెండు రోబోల డ్యాన్స్ వీడియోను నెటిజన్లతో పంచుకుంది. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా దీన్ని విడుదల చేసింది. వాటిని కళలు, వినోదం, రొబోటిక్స్ మేళవింపుగా అభివర్ణించింది. ఈ వీడియోకు 1.4 మిలియన్ వ్యూస్ లభించాయి.

‘మా స్పాట్ మరో విచిత్ర కుక్కను కలుసుకుంది. డ్యాన్స్ కు ఉన్న అపార శక్తిని జోడించి దానితో స్నేహం చేయాలనుకుంటోంది. కుక్క వేషధారణతో ఉన్న స్పార్కల్స్ ను చూడండి. కేవలం స్పాట్ కోసం ముస్తాబైన కస్టమ్ మేడ్ కాస్టూమ్ డాగ్ ఇది’ అని బోస్టన్ డైనమిక్స్ ఆ వీడియో కింద ఓ సరదా క్యాప్షన్ జోడించింది.

ఆ వీడియోలో ముందుగా స్పార్కల్స్, మరో రోబో కుక్క కాస్త ఎదురెదురుగా నిలుచొని ఒకదాన్ని ఒకటి విచిత్రంగా చూసుకుంటాయి. ఆ తర్వాత స్పార్కల్స్ కుక్క రోబో.. స్పాట్ కుక్క రోబోకు స్నేహహస్తం అందిస్తున్నట్లుగా ముందటి కాలు చాపింది. అయితే స్పాట్ స్పందించకపోవడంతో నాలుగు కాళ్లు ఆడిస్తూ డ్యాన్స్ చేసింది. దీంతో ఎగిరి గంతేసిన స్పాట్ కూడా దానితో జత కలిసింది. ఆ రెండూ ముక్కుతో వాసన పసిగడుతున్నట్లుగా దగ్గరకు వచ్చి ఆ వెంటనే దూరం జరిగాయి. అనంతరం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు అనుగుణంగా రకరకాల భంగిమల్లో డ్యాన్స్ చేశాయి. తమ అసాధారణ డ్యాన్స్ కదలికలతో నెటిజన్లను ఆకర్షించాయి. చివరకు అలసిపోయినట్లుగా కింద కూర్చున్నాయి.

ఫ్యాక్టరీలు మొదలు భవన నిర్మాణ ప్రాంతాలు, ల్యాబ్ లలో పనిచేసేందుకు ఈ రోబోలను డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఆటోమేటిక్ సెన్సింగ్, తనిఖీ, అపరిమిత డేటా క్యాప్చర్ లాంటి పనులకు ఇవి ఉపయోగపడతాయని చెప్పింది.

అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఈ వీడియో క్రియేటివ్ గా ఉందని మెచ్చుకోగా మరికొందరు మాత్రం కుక్క రోబోలు రాత్రిళ్లు కలలోకి వచ్చేలా భయంకరంగా ఉన్నాయంటూ విమర్శించారు.

Also Read: కోవిషీల్డ్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు