August Crisis : తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా 'ఆగస్టు సంక్షోభం'.. దాని చరిత్ర ఏంటో తెలుసా?

తెలుగు రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభం అంశం ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత సీఎం రేవంత్ కు ఆగస్టు సంక్షోభం తప్పదని హెచ్చరించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకు ఈ ఆగస్టు సంక్షోభం అంటే ఏమిటీ? దీని చరిత్ర తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

August Crisis : తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా 'ఆగస్టు సంక్షోభం'.. దాని చరిత్ర ఏంటో తెలుసా?
New Update

TS News : అది 1984 ఆగస్టు.. కంగ్రెస్(Congress) కంచుకోటను బద్దలు కొట్టి ఎన్టీఆర్(NTR) ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి అప్పటికి ఏడాది మాత్రమే. ఆ సమయంలో గుండె ఆపరేషన్ కోసం అమెరికా(America) కు వెళ్లిన ఎన్టీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చారు నాదేండ్ల భాస్కర్ రావు(Nadendla Bhaskar Rao). పార్టీలో అసమ్మతిని, తన పాత పార్టీ కాంగ్రెస్ అండను ఆయుధంగా మార్చుకుని ఎన్టీఆర్ ను దించి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి దాదాపు పదేళ్ల తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ పై ఆగస్టు నెలలోనే తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. అప్పటినుంచి తెలుగు రాజకీయాల్లో 'ఆగస్టు సంక్షోభం'(August Crisis) అనే మాట తరచూ వినపడుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం ఆగస్టు సంక్షోభం తప్పదంటూ బీజేపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించడంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.\

1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కరరావు..
ఈ మేరకు 1983 జనవరి 9న ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. అయితే శాసన మండలి కారణంగా పరిపాలనా నిర్ణయాల్లో స్తబ్దత ఏర్పడుతుందని భావించి శాసనమండలిని రద్దుచేయడానికి అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీంతో సొంత పార్టీకి చెందిన నాయకుల్లో ఎన్టీఆర్‌పై వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ క్రమంలోనే 1984 జూన్, జూలైలో హార్ట్ బైపాస్ సర్జరీ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లడంతో ఎన్టీఆర్ పై వ్యతిరేకతను తనకు అనుగుణంగా మార్చుకున్న నాదెండ్ల భాస్కరరావు గవర్నర్ రాంలాల్‌గిరా సహాయంతో 1984 ఆగస్టు 16న ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో 1984 ఆగస్టు 16 నుంచి 1984 సెప్టెంబర్ 16వరకు ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి జాతీయ స్థాయిలో పోరాటం చేశారు. దీని ఫలితంగా 1984 సెప్టెంబర్ 16న నాదెండ్ల భాస్కరరావు సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1984 సెప్టెంబర్ 16న ఎన్టీఆర్ 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వెంటనే తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు పదవులలో కొనసాగకూడదని భావించిన ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌ను కోరారు. దీంతో 1984 సెప్టెంబర్ 24 నుంచి 1985 మార్చి 8 వరకు ఎన్టీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు.

1995 ఆగస్టులో చంద్రబాబు..
ఈ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 202 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో (మిత్ర కూటమితో కలిసి) అత్యధికంగా 246 సీట్లు సాధించి అధికారం దక్కించుకున్నారు ఎన్టీఆర్‌. 1994 డిసెంబర్ 12న ఎన్‌టీఆర్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. ఈ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన, పార్టీలో ఆయన రెండో భార్య అయిన లక్ష్మీపార్వతి జోక్యం పెరిగిందన్న విమర్శలు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులతో పాటు, పార్టీలో ప్రముఖులు సైతం ఎన్టీఆర్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 1995 ఆగస్టులో ఎన్టీఆర్ పై అప్పటి మంత్రి, ఆయన అల్లుడు అయిన చంద్రబాబు సారథ్యంలో తిరుగుబాటు జరిగింది. మెజార్టీ ఎమ్మెల్యేల మద్ధతు కూడగట్టుకుని ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత రామారావు ఇక ముఖ్యమంత్రి కాలేకపోయారు. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టు నెల ఓ చరిత్రగా మిగిలిపోయింది.

ఇది కూడా చదవండి: CAA: ఎన్నికల వేళ హోంశాఖ కీలక నిర్ణయం..14 మందికి భారత పౌరసత్వం మంజూరు!

ఇటీవల బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల కోసం సీఎం రేవంత్ నేల విడిచి సాము చేసి అలవిగాని హామీలు ఇచ్చారన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టిన రేవంత్ ఆగస్టులోపు రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం తప్పదంటూ కామెంట్స్ చేశారు. దీంతో మళ్లీ ఆగస్టు సంక్షోభం అన్న మాట తెలుగు నాట హాట్ టాపిక్ గా మారింది. అయితే.. లక్ష్మణ్ అన్నట్లుగా రేవంత్ సర్కార్ ఆగస్టు సంక్షోభానికి గురవుతుందా? లేక ఎలాంటి అవాంతరాలు లేకుండా రేవంత్ ప్రభుత్వాన్ని నడుపుతారా? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

#telangana #cm-revant-reddy #august-crisis
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe