Tadvai Medaram Forest : పెద్ద గాలి వేసిందనుకోండి.. మన రోడ్డు మీద ఉన్న పది చెట్లలో ఒకటో రెండో పడిపోవడం సహజం. అదీ గాలివాటు వైపుగా పడిపోతాయి. సుడిగాలి వచ్చిందనుకోండి.. దాని పరిధిలో ఓ వంద చెట్లు పడిపోవడం సాధ్యం. కానీ, రెండు గంటల్లో 50 వేల చెట్లు అదీ అడవి మధ్యలో పడిపోవడం సాధ్యమేనా? అసలు అడవి మధ్యలో అన్ని చెట్లు పడిపోవడం అనేది మనం చెప్పుకున్నంత సులువేనా? కానీ, ఏటూరునాగారం దగ్గరలో కేవలం రెండు గంటల్లో దాదాపు 50వేల అరుదైన చెట్లు పడిపోయాయట. ఇది మీరు నమ్మగలరా? కానీ, నమ్మాల్సిందేనని అటవీశాఖ అధికారులు (Forest Officials) చెబుతున్నారు.
రెండు వందల హెక్టార్లలో రెండు కిలోమీటర్ల లైన్ లో దాడ్పు 50 వేల చెట్లు పడిపోయాయి. అత్యంత వింత గొలుపుతున్న ఈ సంఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం దగ్గరలోని తాడ్వాయి -మేడారం గ్రామాల మధ్య జరిగింది. ఈ చెట్లు ఏమైపోయాయి అని అడిగిన ప్రశ్నకు అటవీశాఖ అధికారులు ఉలిక్కి పడి సమాధానాలు వెతుక్కునే పనిలో పడ్డారు.
Trees Fell Down : టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం ములుగు డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ జాదవ్ ఆగస్టు 31 సాయంత్రం 5:30 - 7:30 గంటల మధ్యలో తాడ్వాయి-మేడారం రోడ్డులోని దాదాపు 50 వేల అరుదైన జాతుల చెట్లు పడిపోయాయి. వీటిలో నల్లమద్ది, తెల్లమద్ది, ఎగిస, జువ్వి, నారెప, మారేడు, నేరేడు, ఇప్ప వంటి మిశ్రమ జాతుల చెట్లు ఉన్నాయి. ఇలా ఒక్కసారిగా చెట్లు పడిపోవడానికి కారణం ఏమిటో తెలియరాలేదని రాహుల్ జాదవ్ చెప్పినట్టు ఆ కథనం పేర్కొంది.
ఈ విషయంపై వాతావరణ శాఖ - నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) లను రీసెర్చ్ చేయవలసినదిగా కోరినట్టు ఆయన వివరించారు.
ఎలా పడిపోతాయి?
ఇలా ఒకేసారి అన్ని చెట్లు పడిపోవడానికి కారణం అధికారులు చెప్పలేకపోతున్నారు. కానీ, అరుదైన వాతావరణ అపరిస్థితుల్లో ఇలా జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ, అది చాలా తక్కువ. దీంతో అసలు అక్కడ ఆ చెట్లు పడిపోయాయా/ పడగొట్టారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అన్ని వేల చెట్లను స్మగ్లింగ్ చేయడం కోసమే నరికి వేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అసలు అటవీ అధికారులు ఇలా ఎలా జరిగిందో తెలియదని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరి జేబులు నింపడం కోసం ఆ చెట్లన్నీ కిందకు పడిపోయాయో అనే సందేహాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. ఆ చెట్లను ఎవరు నరికారో తెలీదు. కానీ, చెట్లు పడిపోయాయి. దెయ్యాలు ఏమైనా వచ్చి పడగొట్టేశాయా అని అధికారులను ఉద్దేశించి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడైనా అడవిలో ఒకటీ అరా చెట్లు పడిపోవడం జరగవచ్చు. కానీ, ఇలా వేలాది చెట్లు పడిపోవడం అనేది ఆశ్చర్యాన్నే కాదు అనుమానాలనూ రేకెత్తిస్తోంది.
అయితే , అధికారులు మాత్రం ప్రత్యేక పరిస్థితులలో ఇలా జరగవచ్చని చెబుతున్నారు . అకస్మాత్తుగా వచ్చే టర్నడోలు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు తీసుకువస్తాయని.. వాటి ప్రభావముతో ఇలా తక్కువ వయసు ఉన్న చెట్లు పడిపోయే అవకాశం ఉందనీ అంటున్నారు . అయితే , అటవీశాఖ అధికారులు మాత్రం అలాంటి గాలులు వచ్చాయి అనే విషయాన్ని నిర్ధారించలేదు.
Also Read : ఖమ్మంలో వరదలకు కారణం వారే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!