కామారెడ్డి జిల్లాలో మహిళా దొంగలు భీభత్సం సృష్టించారు. ఓ ఇంటి యజమానురాలిమీద కోపంతో ఏకంగా ఇంటినే దోచేందుకు ప్లాన్ చేసి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డారు. ప్రొఫెషనల్ దొంగలలాగే ముఖాలకు ముసుగులు వేసుకుని పెప్పర్ స్ర్పె, కత్తులు తమ వెంట తెచ్చుకున్నారు. అయితే అనుకోకుండా వాళ్ల ప్లాన్ ఫెయిల్ కావడంతో స్థానికులు చేతిలో అడ్డంగా బుక్కై దెబ్బలపాలయ్యారు.
ఈ మేరకు కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామస్థులు, బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రముఖ వ్యాపారి అయిన దొమకొండకు చెందిన పందిరి కాశీనాథ్, మాచారెడ్డి మండలం లచ్చాపేటకు చెందిన బూస కవితకు సంబంధించి కొన్ని అప్పుల విషయంలో కేసులు అయ్యాయి. ఈ క్రమంలో కాశీనాథ్ కావాలనే తనపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడని కోపం పెంచుకున్న కవిత ఏకంగా కాశీనాథ్ ఇంటిపై కన్నేసింది. ఇంట్లో ఉన్న నగదు, నగలు కొట్టేసేందుకు ముగ్గురు స్నేహితులతో కలిసి స్కెచ్ వేసింది.
ఇది కూడా చదవండి : సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఆ మూడు ప్రాజెక్టులపై విచారణ
ఈ క్రమంలో బుధవారం అర్ధ రాత్రి కామారెడ్డిలో ఉంటున్న తన ఫ్రెండ్స్ సాకలి సరిత, సానియాతో కలిసి కవిత దోమకొండలోని వ్యాపారి ఇంట్లో చొరబడ్డారు. ముఖానికి ముసుగులు వేసుకొని వచ్చిన వారంతా.. కాశీనాథ్ భార్య భువనేశ్వరిపై దాడి చేశారు. ఆమో కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి రెండు తులాల బంగారు గొలుసు లాగేసుకున్నారు. అంతటితో ఆగకుండా నగదు కోసం వెతుకుతున్న క్రమంలోనే భువనేశ్వరి పెద్దగా అరుపులు మొదలుపెట్టింది. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు ఆ ఇంటికి పరిగెత్తగా వాళ్లు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే బీబీపేట రోడ్డు మూలమలుపు వద్ద ఆ ముగ్గురు దొరికిపోగా స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ ముగ్గురిని దోమకొండ ఠాణాకు తరలించి విచారణ మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి : ప్రశాంత్ నేర చరిత్రపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. వెలుగులోకి భయంకరమైన నిజాలు
లావాదేవీల గొడవ:
ఇక ఈ దారుణానికి పాల్పడ్డ నిందితురాలు కవిత విచారణలో సంచలన విషయాలు బయటపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కవిత భర్త సత్యనారాయణ పందిరి కాశీనాథ్ వద్ద ఆరేళ్ల కిందట కొంత అప్పు తీసుకున్నాడు. అయితే ఆయన చనిపోవడంతో ఇళ్లు అమ్మేసి కాశీనాథ్ అప్పు చెల్లించినట్లు కవిత తెలిపింది. అయితే బాకీ చెల్లించినప్పటికీ కాశీనాథ్ తనను వేధింపులకు గురిచేస్తూ పలు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయారు. అయితే ఆ కేసు ఉపసంహరించుకుంటానని చెప్పిన కాశీనాథ్.. మోసం చేయడంతో నిలదీయడానికే ఇంటికి వచ్చానని స్పష్టం చేసింది. అయితే ఈ దొంగలు పడ్డారనే విషయంపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మండల కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇరువర్గాల వివరాలు తెలుసుకున్న ఎస్సై మురళి.. ప్రజలు భయపడొద్దని, ఆర్థికపరమైన గొడవలే ఇందుకు కారణమని వారు దొంగలుకాదని స్పష్టం చేశారు.