Terror Targets Hyderabad ? : దేశవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాదులు తెగబడ్డా.. టెర్రరిస్టులు(Terrorists) పట్టుబడ్డా.. దాని మూలాలు హైదరాబాద్ తో లింక్ అయి ఉండడం సర్వసాధారణం. అంతే కాదు స్లీపింగ్ సెల్స్(sleeping cells) కు కూడా హైదరాబాద్ ఎప్పుడూ ఓ సేఫ్ డెన్ లాగే ఉంటూ వస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా పోలీసులు నిఘా పెంచడంతో కొంత వరకు దీనికి బ్రేక్ పడింది. కాని మళ్లీ కొన్నాళ్లుగా హైదరాబాద్లో ఉగ్రకార్యకలాపాలు తనిఖీల్లో బయటపడుతుంటే టెర్రర్ పుడుతోంది. తాజాగా హైదరాబాద్, మధ్యప్రదేశ్ లోని భోపాల్ కేంద్రంగా హట్ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు NIA అధికారులు గుర్తించడం జరిగింది.
అయితే NIA అధికారులు సోదాల్లో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మంగళవారం రాజేంద్ర నగర్ లో సల్మాన్ అనే టెర్రరిస్టును NIA అధికారులు అరెస్ట్ చేశారు. అయితే అతని ద్వారా సేకరించిన డీటైల్స్ లో నగరంలో ఉగ్రవాద స్థావరాలను గుర్తిస్తున్నారు. మరోవైపు కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్న NIA అధికారులు ఇప్పటికే సల్మాన్ తో కలిపి మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. సల్మాన్ హట్ ద్వారా మిగతా వారిని రిక్రూట్ చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఇక ఉగ్రవాది సల్మాన్ ఇంటి నుంచి NIA అధికారులు పలు కీలక పత్రాలతో పాటు ఎలక్ట్రానికి పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ఏడాదిలోనే NIA అధికారులు హైదరాబాద్లో మొత్తం నాలుగు సార్లు సోదాలు నిర్వహించారు.
కాగా, స్వాతంత్ర్య దినోత్సవాన్ని టార్గెట్ చేసి నగరంలో పేలుళ్లు జరపాలన్నదే అరెస్ట్ అయిన టెర్రరిస్టుల లక్ష్యంగా NIA అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే మే నెలలో హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర కదలికలు బయటపడి సంచలనం సృష్టించాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ సహాయంతో భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. భోపాల్ కు చెందిన 11 మంది, హైదరాబాద్ కు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది.
హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు మధ్యప్రదేశ్ కు తరలించారు. అయితే నిందితుల నుంచి మొబైల్స్, భారీగా మారణాయుధాలు, ఎలక్ట్రానిక్ డివైస్, డ్రాగన్ లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా 18 నెలల నుంచే హైదరాబాద్ లో మకాం వేసి యువతను టెర్రరిజం వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అయితే ఉగ్రవాదులు ఏడాదిన్నర నుంచి హైదరాబాద్ లోనే ఉన్నా.. పోలీసులు పసిగట్టలేకపోవడంతో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే ఓకే సారి ఇంత మంది టెర్రరిస్టులు హైదరాబాద్ లో ఉన్నారన్న వార్త హైదరాబాదీల గుండెల్లో రైళ్ళను పరుగులు తీయించింది. గతంలో జరిగిన లుంబిని పార్క్, దిల్ సుఖ్ నగర్, గోకుల్ చాట్ బాంబు పేలుళ్లను వారు గుర్తు చేసుకున్నారు. అయితే మరోసారి ఆగష్టు 15 ను టార్గెట్ చేసి ఉగ్రవాదులు స్కెచ్ వేయడం..దాన్ని ముందుగానే ఎన్ఐఏ అధికారులు గుర్తించడంతో పెద్ద ముప్పే తప్పింది.