విజయవాడ భారీ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. కొన్ని రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న జనం భయంభయంగా గడుపుతున్నారు. రోడ్లపైనే భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు పెరుగుతోంది. అంతేకాకుండా వాగులు పొంగి పొరలుతున్నాయి. మునేరు, బుడమేరు, పాలేరు నుంచి కృష్ణా నదికు భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో 70 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. 70 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నది తీర దిగువ ప్రాంతంలో నివసించే వారిని అప్రమత్తం చేసినట్టు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.