/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/mailavaram-jpg.webp)
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మంత్రి జోగి రమేష్ అనుచరులు హల్‌చల్ సృష్టించారు. బోసుబొమ్మ సెంటర్‌లో ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిష్టిబొమ్మను మంత్రి అనుచరులు దగ్ధం చేశారు. జి.కొండూరు జెడ్పీటీసీ మందా జక్రి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. చంద్రబాబు డౌన్ డౌన్.. బీసీ మంత్రి జోగి రమేష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పక్క మండలాల నాయకులు వచ్చి మైలవరంలో నిరసన తెలపడంపై స్థానిక ప్రజలకు చర్చించుకుంటున్నారు. మంత్రి అనుచరుల నిరసనకు స్థానిక వైసీపీ నాయకులు దూరంగా ఉన్నారు. స్థానిక నాయకులు రాకపోవడంతో వైసీపీలో అంతర్గత వర్గ పోరు బహిర్గతమైంది. 30 యాక్ట్ అమలులో ఉన్నా వైసీపీ నాయకుల నిరసన వైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. పట్టుమని పాతికమంది వైసీపీ నాయకులు లేకపోయినా ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. కానీ పోలీసులు మాత్రం ట్రాఫిక్ క్లియర్ చేయలేదు. పోలీసులు తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిష్టిబొమ్మ దగ్ధం
సమాచారం అందుకున్న స్థానిక టీడీపీ నాయకులు మంత్రి జోగి రమేష్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. పోలీసులు వెంటనే టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు-పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు లంకా లితీష్, పలువురు టీడీపీ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వైసీపీ నాయకులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో.. పోటీగా టీడీపీ నాయకులు జోగి రమేష్ దిష్టిబొమ్మ దగ్ధం చేయబోయారు. వేరే మండలాల నుంచి వైసీపీ నాయకులు వచ్చి ఆందోళన చేస్తే ప్రశ్నించని పోలీసులు.. టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరును మైలవరం నగర వాసులు, టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు.