/rtv/media/media_files/2025/09/06/ganesh-1-2025-09-06-08-25-48.jpg)
హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు అంటే అందరికీ గుర్తుకువచ్చేది ఖైరతాబాద్ గణేషుడే . ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సుమారు 71 సంవత్సరాల చరిత్ర ఉంది. 1954లో కేవలం ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలైన ఈ ఉత్సవాలు, ప్రతి సంవత్సరం విగ్రహం ఎత్తును పెంచుతూ వచ్చారు. 2025లో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి పేరుతో 69 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌కు బదులుగా పూర్తిగా మట్టితో తయారు చేశారు. అయితే ఈ ఖైరతాబాద్ గణేషుడి లడ్డూను ఎందుకు వేలం వేయరనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది.
భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని
ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కొన్ని సంప్రదాయాలను పాటిస్తుంది, అందులో లడ్డూను వేలం వేయకూడదనే నియమం కూడా ఉంది. ఇక్కడ లడ్డూను ప్రసాదంగా భావిస్తారు. దానిని వ్యాపార వస్తువుగా పరిగణించకుండా అందరికీ పంచిపెట్టడం ద్వారా దాని పవిత్రతను కాపాడాలని భావిస్తారు. లడ్డూ కోసం వేలంపాట పెట్టడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని కమిటీ భావిస్తుంది. ఎందుకంటే లడ్డూను ప్రసాదంగా స్వీకరించాలని భక్తులు కోరుకుంటారు. ఖైరతాబాద్ గణేషుడి లడ్డూ దాని పరిమాణానికి, రుచికి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ లడ్డూ తయారీ కోసం కేరళకు చెందిన ఒక ప్రత్యేక బృందాన్ని పిలిపిస్తారు. ఈ లడ్డూ తయారీకి శుభ్రమైన, నాణ్యమైన పదార్థాలను ఉపయోగిస్తారు. దీనిని కొన్ని టన్నుల బరువుతో తయారు చేస్తారు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లడ్డూల్లో ఒకటిగా నిలిచింది.