తెలంగాణలో నడుస్తోది ప్రజాపాలన కాదు..బుల్డోజర్‌ పాలన..కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇండ్లను కూలగొట్టడం భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేయడం ఇదే రేవంత్ రెడ్డి పరిపాలన అంటూ విమర్శించారు.

New Update
KTR

KTR

KTR : రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇండ్లను కూలగొట్టడం భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేయడం ఇదే రేవంత్ రెడ్డి పరిపాలన అంటూ విమర్శించారు.  మూసి పేరిట రేవంత్‌ రెడ్డి చేస్తున్న స్కామ్ కోసం వేలాదిమంది ప్రజల ఇండ్లను  కూలకొడుతున్నాడని, మూసి బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో మూసీ బాధితుల కోసం నిర్వహించిన ‘మూసీ దండి మార్చ్’  పాదయాత్రలో కేటీఆర్ పాల్గొన్నారు. మూడున్నర కిలోమీటర్ల పాటు సాగిన ఈ యాత్రలో ఆయన అనేకమంది బాధితులను కలుస్తూ ముందుకు సాగారు.  కాంగ్రెస్‌ అంటే.. మోసం అని తెలిసే నగర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు.

అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో వందల మంది ఇళ్లు కూలగొట్టిన రేవంత్ రెడ్డి.. అటు రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఇబ్బంది కలిగేలా వారి జీవితాలను చిన్నాభిన్నం చేసేలా ఇళ్లు కూలగొడుతున్నారన్నారని మండి పడ్డారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం తన అనుచరులకు, అన్నదమ్ములకు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం మూసీ పేరుతో భారీ స్కామ్ కు తెరలేపారని ఆరోపించారు.  దీనికోసం పేదల ఇళ్లను పణంగా పెడుతున్నారన్నారని ఆరోపించారు. గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 16 వేల కోట్ల రూపాయలతోనే మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని ఒక్క ఇల్లు కూడా పోకుండా డీపీఆర్ (DPR) ని కూడా సిద్ధం చేశామని గుర్తు చేశారు. ఈరోజు మూసీ బఫర్ జోన్‍కి సంబంధించి కాంగ్రెస్‌ రకరకాల మాటలు చెప్తున్నదని,  ఆరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇదే అపార్ట్‌మెంట్లకు పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్‌ కాదా అని ఆయన ప్రశ్నించారు. మరి అలాంటి అధికారులకు ఆనాడు అనుమతులు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొట్టాలా అని కేటీఆర్ ప్రశ్నించారు.

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.3,866 కోట్లతో ఎస్టీపీలు నిర్మించడమే కాకుండా, ఒక్క ఇల్లు పడగొట్టకుండా ఉప్పల్‌ ప్రాంతంలో 5 కి.మీ మేర మూసీ సుందరీకరణ చేసినట్లు కేటీఆర్‌ గుర్తు చేశారు. మధుపార్క్‌ రిట్జ్‌ ఒక్కటే కాకుండా మూసీ పొడవునా 55 కిలోమీటర్ల మేర లక్షాయాభై వేల కుటుంబాలకు దీనివల్ల అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కోసం ఎంతవరకైనా కొట్లాడతామని అన్నారు.  ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్‌మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని, ఈ పోరాటంలో భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు కోసం వేలమంది ఇళ్లను కూల్చడం ఆపేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. మరోవైపు తమ ఎమ్మెల్యేలను, నాయకులను పంపి బెదిరింపులకు దిగడం మానేయాలని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు, ఇండ్లకు బదులు డబ్బులు ఇస్తామని మోసం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు లొంగకుండా ఐక్యంగా ముందుకు సాగాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.   

Advertisment
తాజా కథనాలు