/rtv/media/media_files/2026/02/14/telangana-2026-02-14-09-03-22.jpg)
The process for electing the mayor and chairperson..
Municipal Results : తెలంగాణ వ్యాప్తంగా అంత్యంత ఉత్కంఠగా సాగిన మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. కొన్ని మున్సిపాలిటీల్లో అనుకున్న స్థాయలో ఆయా పార్టీలకు మెజారిటీ రాగా మరికొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. రేపు విజేతలైన కౌన్సెలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. మెజారిటీ ఉన్న చోట ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉండటంతో అక్కడ చేయి ఎత్తే విధానం ద్వారా ఎన్నిక జరుగుతుంది. ఇక ఏకగ్రీవం కానీ చోట కోరం ఉంటే చేయి ఎత్తే విధానంతో పాటు ఎక్స్ అఫీషీయో సభ్యుల ఓటింగ్‌తో ఛైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నిక జరగనుంది. కోరం లేకుంటే ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకుందాం
కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా కలిసి మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నుకోవలసి ఉంటుంది. మొదట వీరంతా రేపు అనగా 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది.
కోరం అంటే ఏంటీ :చైర్మన్, మేయర్లను పరోక్ష ఎన్నిక ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. దీనికోసం రాష్ర్ట ఎన్నికల సంఘం విధివిధానాలను రూపొందించింది. ఎన్నిక నిర్వహించడానికి మొత్తం ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో కనీసం సగం మంది ఉంటేనే కోరం ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఒకవేళ కోరం లేకపోతే ఛైర్ పర్సన్, మేయర్ ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. ఆ రోజు కూడా కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. వారు మరో రోజును ఖరారు చేసి, అప్పుడు కోరం లేకపోయినప్పటికీ ఎన్నిక నిర్వహిస్తారు.
ఎన్నుకునే విధానం ఇలా : రిజర్వేషన్లు నిర్ణయించిన ప్రకారం ఛైర్‌పర్సన్‌లు, మేయర్‌లను ఎన్నుకోవడం జరుగుతుంది. వైస్ ఛైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్లకు మాత్రం రిజర్వేషన్లు వర్తించవు. మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఒకరు మాత్రమే పోటీలో ఉంటే ఏకగ్రీవంగా వారు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే అప్పుడు ఎన్నిక తప్పదు. ముందుగా ఛైర్‌పర్సన్, మేయర్, ఆ తర్వాత వైస్ ఛైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహిస్తారు. ఒకవేళ అనుకోని కారణంతో ఛైర్‌పర్సన్, మేయర్ ఎన్నిక వాయిదా పడితే, వైస్ ఛైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా వాయిదా వేస్తారు.
చేయి ఎత్తే విధానం : కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు చేయి ఎత్తి ఓటు వేయాల్సి ఉంటుంది. అపుడు ఆ చేతులను లెక్కించి ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటువేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ రెండు వర్గాల వారికి సమాన ఓట్లు వస్తే ఈ ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారుతాయి. వారు ఎవరికి ఓటు వేస్తే వారే విజేతలవుతారు. ఒకవేళ సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. దీనికోసం ఒక్కో అభ్యర్థి పేరు 5 పేపర్లపై రాసి, అన్నీ కలిపేసి స్థానిక ఎన్నికల అధికారి లాటరీ తీస్తారు. అందులో ఎవరి పేరు వస్తే వారే విజేత. ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు తమ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండవచ్చు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో మాత్రమే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకొనే అవకాశం ఉంటుంది.
విప్​ జారీ చేసే అవకాశం : రాజకీయ పార్టీలకు వారి పార్టీ అభ్యర్థులకు విప్ జారీ చేసే అధికారం ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం వంటి ప్రధానమైన 13 పార్టీలకు ఈ అవకాశం ఉంది. పార్టీల గుర్తులతో అభ్యర్థులుగా గెలిచిన వారు విప్‌ను కచ్చితంగా పాటించాలి. ఒకవేళ విప్ ధిక్కరిస్తే ఆ పార్టీ మూడు రోజుల్లోగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థికి నోటీసులిచ్చి వివరణ కోసం వారం రోజులు గడువు ఇస్తారు. ఆ తర్వాత రెండు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. విప్ జారీ చేసేందుకు రేపు ఉదయం 11 గంటల్లోపు స్థానిక ఎన్నికల అధికారికి ఆయా పార్టీలు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థికి ఆయా పార్టీలు బీ-ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. వారు రేపు ఉదయం 10 గంటల్లోపు స్థానిక ఎన్నికల అధికారికి బీ-ఫారం సమర్పించాల్సి ఉంటుంది.
Follow Us