/rtv/media/media_files/2025/01/23/Sd30WZgmfQMkKrbIJ3D9.jpg)
Telangana Municipal Elections
Telangana Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఈ లోపు క్యూలైన్‌లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కలిపించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగాయి. చెదురుమదురు ఘటనలు జరిగినప్పటికీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ రోజు మధ్యాహ్నానానికి అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
కాగా ఉదయం నుంచి కొనసాగిన పోలింగ్ సరళిని 100 శాతం వెబ్ కాస్టింగ్‌తో ఎన్నికల అధికారులు పరిశీలించారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 62.5 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే మున్సిపాలిటీలలో ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. కాగా 13న శుక్రవారం ఉదయం 8గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, ఆ రోజు సాయంత్రంలోపు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయని అధికారులు తెలిపారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో తమ పట్టు నిలుపుకునేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమించాయి. పలు చోట్ల పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అన్నట్లు కొనసాగింది. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఒక దశలో ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు తిట్లపురాణం అందుకున్నారు. అన్ని పార్టీల హామీలు, ప్రచారాన్ని నిశితంగా గమనించిన ఓటర్లు పార్టీల భవిష్యత్ ను, అభ్యర్థుల అదృష్టాన్ని ఓటు రూపంలో బ్యాలెట్ బాక్కుల్లో నిక్షిప్తం చేశారు. ఓటర్లు ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీకి పట్టం కట్టారో ఎల్లుండి తేలనుంది. అలాగే మొత్తం 116 మున్సిపాలిటీలలోని 2582 వార్డులకు గాను 12 వార్డులు ఏకగ్రీవం కాగా ఒక చోట వాయిదా పడింది. దీంతో ఇవాళ 2569 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 414 వార్డుల్లో 2 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.మిగిలిన 412 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. వీటి ఫలితాలన్నీ శుక్రవారం తేలనున్నాయి.
Follow Us