గ్రూప్-1 పరీక్షపై టీపీసీసీ చీఫ్ మరో కీలక ప్రకటన.. అభ్యర్థులకు భరోసా!

గ్రూప్-1 మెయిన్స్ కు హాజరు అవుతున్న అభ్యర్థులకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించడంపై హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని భరోసానిచ్చారు.

New Update
MAHESH GOUD TPCC

గ్రూప్‌-1 పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించడంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది శుభపరిణామమన్నారు. తమ ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలను హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్థించాయన్నారు. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం గ్రూప్‌-1 అభ్యర్థులకు సంతోషకరమన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆలోచనలు లేకుండా పరీక్ష రాయాలని సూచించారు. అభ్యర్థులకు13 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం ఇదన్నారు. దీనిని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు పొందాలని సూచించారు.

ఇది కూడా చదవండి: T-SAT: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాలకు ఫ్రీగా కోచింగ్!

అభ్యర్థులకు అండగా ఉన్నాం..

తాము మొదటి నుంచి గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటున్నామన్నారు. ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ వస్తున్నామన్నారు. జీవో -29 వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగదని మరోసారి చెబుతున్నానన్నారు. తాను బీసీ బిడ్డగా విద్యార్థులకు భరోసా ఇస్తున్నానని.. రిజర్వేషన్ల ఉల్లంఘన జరగదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వారి రాజకీయ లబ్ధి కోసం గ్రూప్-1 విద్యార్థులను పావుగా వాడుకున్నాయని ధ్వజమెత్తారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి భవిష్యత్తును బాగుచేసుకోవాలని ఆకాంక్షించారు. పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Group-1:పరీక్ష జరిగినా రద్దు కావడం ఖాయం.. గ్రూప్-1 అభ్యర్థుల వాదన ఇదే!

ప్రారంభమైన పరీక్ష

మరో వైపు గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీక్ష వాయిదా పడుతుందని చివరి నిమిషం వరకు అనేక మంది అభ్యర్థులు ఎదురు చూశారు. కానీ సుప్రీంకోర్టు సైతం పరీక్ష వాయిదాకు నిరాకరించడంతో వారంతా నిరాశకు గురయ్యారు. జీవో నంబర్.29పై అభ్యర్థులు ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది కోర్టులో నిలవదని.. తద్వారా మెయిన్స్ పరీక్షను నిర్వహించినా అది రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం భవిష్యత్ లో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండడం కోసమే జీవో నంబర్ 29 ను తీసుకువచ్చామని చెబుతోంది. తద్వారా అభ్యర్థులకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు