HYDRA: హైడ్రాను ఇక టచ్ చేయలేరు.. రేవంత్ సర్కార్ సంచలన వ్యూహం!

భవిష్యత్ లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయ్యింది. ఈ నెల 20న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆర్డినెన్స్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

author-image
By Nikhil
HYDRA
New Update

హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఇదే ముచ్చట. ఏ టీవీ ఛానల్ పెట్టినా ఇదే న్యూస్. హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, నాలాలు, పార్కుల పరిరక్షణకు తీసుకువచ్చిన ఈ వ్యవస్థ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. ప్రతీ చోట తమ ప్రాంతంలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ రావాలన్న డిమాండ్ వ్యక్తం అవుతోంది. ఇటీవల తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో వరదల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడడంతో అక్రమణలే ఇందుకు కారణమని.. ఇది నివారించాలంటే హైడ్రా లాంటి వ్యవస్థ ప్రతీ చోట రావాలన్న చర్చ జోరుగా సాగింది. జిల్లాల పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సైతం జిల్లాల్లో హైడ్రా లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

హైడ్రా చట్టబద్ధతపై అనేక ప్రశ్నలు


అక్రమ కట్టడాల కూల్చివేతలతో జోరు మీద ఉన్న హైడ్రాపై ఇటీవల పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలు హైడ్రాకు చట్టబద్ధతే లేదంటూ పలువురు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఈ మేరకు హైకోర్టులో కేసు కూడా నమోదైంది. హైడ్రాను మరింత బలోపేతం చేస్తున్న వేళ.. ఇలాంటి చర్చ జరగడంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో హైడ్రాకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా చట్టబద్ధం చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. హైడ్రా యాక్టును తీసుకురావాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

కేబినెట్ మీటింగ్ లో ఆర్డినెన్స్..

ఇందుకు సంబంధించి ఆర్డినెన్స్ తేవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 20న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అనంతరం రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా హైడ్రాకు ఎలాంటి చిక్కులు ఉండవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రత్యేక ట్రైబ్యునల్:

మరోవైపు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి హైకోర్టులో పలు వ్యాజ్యాలు సైతం దాఖలైన విషయం తెలిసిందే. భవిష్యత్ లోనూ కూల్చివేతలు జరుగుతున్నా కొద్దీ.. అనేక మంది వ్యాజ్యాలు దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటి పరిష్కారానికి ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోది. ఈ ట్రైబ్యునల్ కు ఛైర్మన్ గా హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ను నియమించనున్నట్లు సమాచారం. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులను ఇందులో సభ్యులుగా నియమించే అవకాశం ఉంది. 

#hydra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe