రజకార్లను తరిమికొట్టిన భారత సైన్యం.. 76 ఏళ్ల క్రితం ఇదే రోజు ఏమైందంటే?

1948 సెప్టెంబర్ 13న మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుంచి హైదరాబాదును ముట్టడించింది. ఈ సైనిక చర్య నిజాంని రాష్ట్రం నుంచి తరమికొట్టేలా చేసింది. ఇదంతా 5 రోజుల్లోనే ముగిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

author-image
By Nikhil
New Update

అది సెప్టెంబర్ 13, 1948.. ఉదయం 4 గంటలు.. నిజాం పాలకుల నడ్డి విరిగిన సమయం.. రజాకార్లపై భారత సైన్యం విరుచుకుపడిన కాలం..! నిజాం నుంచి తెలంగాణ ప్రజల బానిస సంకేళ్లు తెగడానికి కారణమైన ఈ ముహుర్తానికి 76ఏళ్లు పూర్తయ్యాయి. ఐదు రోజుల పాటు నిజాం సైనికులపై ఇండియన్ ఆర్మీ తాడోపెడో తెల్చుకుంది. రోజుల వ్యవధిలో హైదరాబాద్‌ సంస్థానం భారత్ హస్తగతమైంది.

విలోచనమా? విలీనమా?

ఒకరి దృష్టిలో విలీనం.. మరొకరి దృష్టిలో ఇది విమోచనం.. ఇంకొకరికి మాత్రం విద్రోహం..! రాజకీయ పార్టీలు ఏ పేరుతో పిలిచినా అది వారి స్వార్థ ప్రయోజనాల కోసమే అవుతుంది. అయితే ఎలా పిలిచినా ఏమని పిలిచినా ఇది మాత్రం తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు సంబంధించిన అంశం. 'నీ బాంచన్ కాల్మొక్త' అంటూ బతుకులీడ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడడం, నాటి పాలకుల అంతులేని దురాగతాలపై కమ్యూనిస్టులు పోరాడిన తీరు.. ఫినిషింగ్‌ టచ్‌గా ఆపరేషన్‌ పోలో పేరిట భారత్ ప్రభుత్వ సైనిక చర్య.. ఇలా ఎన్నో కారణాలు తెలంగాణ ప్రజలను నిజాం పాలన నుంచి విముక్తి చేశాయి.

ఇక వాస్తవానికి నిజాం రాజు కోసం రజాకార్ల మిలీషియాను ఖాసిం రజ్వీ సృష్టించాడు. నిజాం సంస్థానంలో 90శాతం మంది హిందువులే ఉండేవారు. రజ్వి చేయని దారుణాలు లేవు. వారిని ఎదిరిస్తే కాల్చి చంపేవారు. బైరాన్‌పల్లిలో 108 మందిని ఇలానే చంపారు. నిర్మల్‌లో వెయ్యిమందిని ఉరితీశారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. శవాలను కూడా బూటుకాళ్ళతో తన్నిన నరహంతకులు రజాకార్లు. నిజాం రాజుల దృష్టిలో ప్రజలంతా బాంచెలు.. అంటే కట్టు బానిసలు.

హిందూ పౌరులపై రజాకార్ల దౌర్జన్యాలు పెరిగిపోయిన కాలంలో నెహ్రూ ఆపరేషన్‌ పోలో ప్లాన్ వేశారు. 1948 సెప్టెంబర్ 13న మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుంచి హైదరాబాదును ముట్టడించింది. ఉత్తరంలో ఔరంగాబాద్, పశ్చిమాన షోలాపూర్, దక్షిణాన కర్నూలు, వాయువ్యంలో ఆదిలాబాద్, ఆగ్నేయంలో విజయవాడ, నైరుతిలో రాయచూరు నుంచి ఒకేసారి ఆపరేషన్ పోలో మెుదలైంది. సెప్టెంబర్ 13న మెుదటగా నల్ దుర్గ్ పట్టణం దగ్గర ఉన్న ఎత్తైన ప్రదేశాన్ని ఇండియన్ ఆర్మీ ఆక్రమించింది. ఇలా తొలి మెట్టునెక్కిన ఇండియన్ ఆర్మీ ఐదు రోజుల్లో నిజాం ప్రైవేట్ ఆర్మీ అయిన రజాకార్ల ఆటకట్టించింది.

ఈ సైనిక చర్యలో 1373 మంది రజాకార్లు హతమయ్యారు. మరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది. అటు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యాడు. ఆ తర్వాత రజ్వీ కొన్నాళ్ళు భారత్‌లో జైలు జీవితం గడిపాడు. విడుదలైన తర్వాత పాకిస్తాన్‌కు వెళ్ళి స్థిరపడ్డాడు. కొన్నాళ్ళకు అక్కడే ఓ అనామకుడిలా మరణించాడు.

అటు భారత త్రివిధ దళాలు చక్కటి సమన్వయ విధానాన్ని అవలంబించాయి. వ్యూహాత్మకంగా ముఖ్యమైన నగరాలను వేగంగా స్వాధీనం చేసుకున్నాయి. ఈ సైనిక చర్య నిజాంని రాష్ట్రం నుంచి తరమికొట్టేలా చేసింది. ఇదంతా 5 రోజుల్లోనే ముగిసింది. సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ నిజాం కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాతి రోజు హైదరాబాద్‌ ఆర్మీ జనరల్ ఎడ్రూస్ అధికారికంగా భారత్‌కు లొంగిపోయారు.

#telangana
Advertisment
తాజా కథనాలు