/rtv/media/media_files/2025/10/08/high-court-2025-10-08-13-52-10.jpg)
High Court
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అనిల్‌కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశాడు. పాలసీలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యంగా దరఖాస్తు ఫీజు, రిజర్వేషన్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయబడింది. గతంలో రూ. 2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును ఏకంగా రూ. 3 లక్షలకు పెంచడంపై పిటిషన్‌లో అభ్యంతరం తెలిపారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల రుసుం పెట్టారని పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశాడు.
రూ.3 లక్షలు అబ్కారీ శాఖకే వెళ్తాయని
ఒకవేళ లాటరీలో షాపు దక్కకపోతే రూ.3 లక్షలు అబ్కారీ శాఖకే వెళ్తాయని, డబ్బును తిరిగిచ్చేలా ఆ శాఖను ఆదేశించాలని అనిల్‌కుమార్ తన పిటిషన్ లో కోరాడు. అంతేకాకుండా లిక్కర్ పాలసీపై జారీ చేసిన జీవోను కొట్టివేయాలని కోరాడు. ఇక కొత్త పాలసీలో గౌడ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్ల నిబంధనల్లో కొన్ని అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తినట్లు సమాచారం. దీనిపై ఆబ్కారీశాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను హైకోర్టు రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.
2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు (రెండేళ్ల కాలానికి) మద్యం దుకాణాల లైసెన్స్‌లను కేటాయించేందుకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 దుకాణాలకు లైసెన్సులు కేటాయించడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు రుసుము, లైసెన్స్ ఫీజుల రూపంలో భారీ ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.