స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 9 (GO No. 9) పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా స్టే విధించినట్లయింది. ఈ ఉత్తర్వుల కారణంగా, రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సుమారు ఆరు వారాల పాటు నిలిచిపోనుంది. ఈ విషయంపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ (15%), ఎస్టీ (10%) రిజర్వేషన్లతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెం. 9 ను జారీ చేసింది. అయితే, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు (ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి). ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం వలన మొత్తం రిజర్వేషన్లు 50% పరిమితిని దాటిపోతున్నాయని పేర్కొంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం సమాలోచనలు
ఆ క్రమంలో రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం ముందు 3 అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంలో సవాల్ చేయడం.. ఒకవేళ సుప్రీంలో తీర్పు అనుకూలంగా వస్తే ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుంది. లేదంటే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లడం.. ఇలా చేయాలంటే మళ్లీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది లేదంటే చివరగా హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ 4 వారాలు వేచి చూడాలి. మరి ప్రభుత్వం ఏం చూస్తుందో చూడాలి.