/rtv/media/media_files/2025/10/30/montha-cyclone-effect-on-telangana-2025-10-30-10-37-18.jpg)
Montha Cyclone Effect On Telangana
Montha Cyclone : మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కకున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో గ్రామాలు, పట్టణాలు చెరువులను తలపిస్తున్నాయి. చేతికొచ్చిన పంటను అమ్ముదామని మార్కెట్‌కు తీసుకెళ్లిన రైతులకు పంట కొట్టుకుపోవడంతో లబోదిబోమంటున్నారు. నిన్నటివరకు ఏపీపై ప్రభావం చూపిన మొంథా ఒక్కసారిగా దిశ మార్చుకోవడంతో తెలంగాణ నిండా మునిగింది. భారీ వర్షాలకు వరంగల్ లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధానంగా వరంగల్ నగరంతో పాటు హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ -హనుమకొండ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
/filters:format(webp)/rtv/media/media_files/2025/10/30/30102025wagrain-gal12-2025-10-30-10-37-42.webp)
వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వరద
వర్షం తగ్గినా వరంగల్ నగరం జలదిగ్బంధంలోనే ఉంది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. 118 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అమరావతి నగర్, భవానీ నగర్ నీట మునిగాయి. హన్మకొండ ఊర చెరువుకు గండి పడింది. హంటర్ రోడ్డు మార్గంలో భారీగా చేరిన వరద నీరు చేరింది. ప్రభుత్వ హాస్టల్ భవనం నీట మునిగింది. NDRF,SDRF సిబ్బంది రంగంలోకి దిగారు. ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలెవరూ బయటకు రావొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ములుగు రోడ్డు వద్ద నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పలు కాలనీల్లోకి వరదనీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. వరంగల్ తూర్పు పరిధిలో ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు. హన్మకొండ వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరింది. దీంతో జవహర్ కాలనీ, గోపాల్‌పూర్, 100 ఫీట్ల రోడ్డు పూర్తిగా మునిగిపోయాయి. కాజీపేట, హనుమకొండ మధ్య ఉన్న సోమిడి, గోపాల్‌పూర్ చెరువులు కట్టలు తెగి భారీగా వరద నీరు రోడ్డు పైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు కాలనీల్లో ఇంటి ముందు నిలిపిన కార్లు, బైక్‌లు జల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి.
/filters:format(webp)/rtv/media/media_files/2025/10/30/30102025wagrain-gal8-2025-10-30-10-38-01.jpg)
మొంథా తుపాను ప్రభావంతో ఖమ్మంలోని ‘మున్నేరు’ పరివాహకం ప్రాంతం వరదలో చిక్కుకుంది. మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీల్లోకి వరద చేరింది. మోతీనగర్‌లోని 35, బొక్కలగడ్డలో 57 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మున్నేరుకు భారీగా వరద చేరుకుంటోంది. వాగు ప్రస్తుతం నీటిమట్టం 24.7 అడుగులకు చేరింది. ఎగువన భారీ వర్షాలతో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వరద నీరు ఖమ్మం-బోనకల్ ప్రధాన రహదారిపైకి చేరింది. ఖమ్మం నగరంలోని దంసలాపురం వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై మూడు అడుగుల నీరు చేరుకోవడంతో ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/10/30/121029102025ongole1a-2025-10-30-10-38-23.webp)
నల్గొండ జల్లాలోనూ తుఫాను ప్రభావం కనిపించింది. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం బిలిజపూర్‌లో 15.9 సెం.మీ, నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో 11.7 సెం.మీ, జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో 23.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో రుద్రవల్లి -జూలురు లోలెవల్ వంతెనలపై నుంచి నాలుగు అడుగుల ఎత్తులో మూసీ పరవళ్లు తొక్కుతోంది. భువనగిరి, బీబీనగర్, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లోని పలు గ్రామాలకు మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. జనగామ జిల్లా జనగామ -హుస్నాబాద్ మార్గంలో గానుగపహాడ్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద తీవ్రతకు కొట్టుకుపోయింది.
ఇక కరీంనగర్ జిల్లా రూరల్ మండలంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని దుందుభి, చంద్రసాగర్ నదులు ఉప్పొంగి ప్రవహించడంతో దాదాపు 20 గ్రామాలకు రవాణా స్తంభించిపోయింది. శ్రీశైలం- హైదారాబాద్ జాతీయ రహదారిలోని లత్తిపూర్ సమీపంలోని డిండి ప్రాజెక్టు అలుగు వద్ద వంతెన కోతకు గురైంది. ఆ వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద పెరగడంతో దిగువకు నీళ్లు వదిలారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మొత్తంగా 6,203 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
అప్రమత్తంగా ఉండండి
తుఫాను, వరదల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మొంథా తుపాను ప్రభావంపై అధికారులను బుధవారం సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ‘‘వరి కోతల సమయం కావడం.. పలు చోట్ల కల్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో.. ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలి. వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడం, పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో.. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. మొంథా తుపాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలి. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున.. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సూచించారు.
Follow Us