Caste Census: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువ వినపడుతున్న లేదా కనపడుతున్న రెండు ముఖ్యమైన అంశాలు ఒకటి హైడ్రా.. మరొకటి కులగణన. అయితే, ప్రస్తుతానికి హైడ్రా మాత్రం కేవలం హైదరాబాద్ వరకే పరిమితం కాగా.. కులగణన అనే అంశం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడుతుమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ... ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేస్తుందా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
కమిషన్ ఏర్పాటు ఎందుకో అన్నట్లు...
కులగణన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. గల్లీ కాంగ్రెస్ నాయకుల నుంచి ఢిల్లీలో ఉన్న జాతీయ కాంగ్రెస్ నాయకుల వరకు చెబుతున్నారు. ఈ క్రమంలో సెప్టెంబరు 6న బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. కులగణనకు విడిగా మార్గదర్శకాలు విడుదల చేస్తామని గతంలో పేర్కొంది. కాగా ఈ కమిషన్ ఏర్పాటుతో కులగణన తథ్యం అనే భావన రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమైంది. అయితే ఈ కమిషన్ ఏర్పాటు చేసి నెలరోజులు గడిచినా.. కులగణన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కానీ.. కాంగ్రెస్ నాయకుల నుంచి క్లారిటీ రావడం లేదు. ఇటీవల బీసీ సంఘాలతో సమావేశమైన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నాలుగు రోజుల్లో కులగణనపై మార్గదార్శలను ప్రభుత్వం విడుదల చేస్తుందని ప్రకటించారు. ఆయన చెప్పిన గడువు ముగిసినా.. మార్గదర్శకాలు విడుదల కాకపోవడం చర్చనీయాంశమైంది.
బీసీ కులగణన మాత్రమేనా?
కులగణన అంశంపై తెలంగాణ ప్రజల్లో అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కులగణన అని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. కేవలం బీసీ కులగణన చేస్తుందా? లేదా మొత్తం అన్ని కులాల్లో కులగణన చేస్తుందా? అని సామాన్యుల నుంచి మేధావుల దాక వారి మెదడులో మెదులుతున్న ప్రశ్న ఇది. దీనిపై కాంగ్రెస్ నేతలు సైతం నోరు మెదపకపోవడంతో ఈ కులగణనపై పుకార్లకు రెక్కలు పెరిగి అంతటా తిరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో కులగణన జరగలేదు. అయితే కులగణన అంశాన్ని ఆయుధంగా మలుచుకున్న కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలకు వెళ్లగా.. బీజేపీకి సీట్లు తగ్గేందుకు కారణమైంది. ఇదిలా ఉంటే తెలంగాణ జనాభా ఎక్కువ శాతం వాటా బీసీలకే ఉంది. అయితే, ప్రస్తుతం రేవంత్ కేవలం బీసీ కులగణన చేపడుతుందా? లేదా అన్ని కులాలకు కులగణన చేపడుతుందా?అనేది క్లారిటీ రావాల్సింది. ఒకవేళ చేపడితే ఓటర్ లిస్ట్ ఆధారంగా చేపడుతుందా?.. దీనికి ఎలాంటి విధివిధానాల అనుసరిస్తుంది అనే చర్చలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మొదలయ్యాయి.
మార్గదర్శకాలపై డిమాండ్..
కులగణనపై కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న సరిగా లేదని బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు గడుస్తున్నా కులగణన ఇంకెప్పుడు చేస్తారన్న డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. మార్గదర్శకాల విడుదల ఆలస్యం అయితే.. ఆందోళనలు చేపట్టేందుకు బీసీ సంఘాలు సిద్ధం అవుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...
తెలంగాణలో సర్పంచుల పదవి కాలం ముగిసిన ఇంకా ఎన్నికల నగారా మోగలేదు. ఇందుకు ప్రధాన కారణం కులగణన అంశం. కులగణన చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్ తో పాటు అనేక కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పలుమార్లు ప్రకటన చేశారు.ఇటీవల కులగణన అంశంపై పలు బీసీ సంఘాల నేతలు కోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో కులగణన త్వరగా చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం మూడు నెలల్లో కులగణన చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే, హైకోర్టు ఆదేశాలతో మూడు నెలల్లో తెలంగాణలో కులగణన చేపడుతామని ఇటీవల మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. కానీ ఇంత వరకు ఆ ప్రక్రియ మొదలు కాకపోవడం చర్చనీయాంశమైంది.