/rtv/media/media_files/2025/09/30/telangana-choutuppal-man-ramabrahmam-selling-66-sq-yard-land-lucky-draw-in-yadadri-2025-09-30-16-38-58.jpg)
Telangana Choutuppal Man Ramabrahmam Selling 66 Sq Yard Land Lucky Draw in Yadadri
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్‌కు చెందిన రాంబ్రహ్మం అనే వ్యక్తి తనకున్న ఇంటి స్థలాన్ని అమ్ముకునేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. తన ఆర్థిక అవసరాల దృష్ట్యా, సుమారు రూ. 16 లక్షల విలువ చేసే 66 గజాల స్థలం, దానిపై ఉన్న రేకుల గదిని లక్కీ డ్రా ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. ఈ ఐడియా స్థానికంగా చర్చనీయాంశమైంది.
రూ.500లకే రూ.16లక్షల ఇంటిస్థలం
రాంబ్రహ్మం తన స్థలం అమ్మకానికి రూ. 500 విలువ గల కూపన్లను ముద్రించారు. మొత్తం 3,000 కూపన్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు రూ. 500 చెల్లించి కూపన్ కొనుగోలు చేసి, తమ పూర్తి వివరాలతో డబ్బాలో వేయాల్సి ఉంటుంది. నవంబర్ 2న లక్కీ డ్రా తీయనున్నారు. ఈ డ్రాలో విజేతగా నిలిచిన వ్యక్తికి కేవలం రూ. 500కే రూ. 16 లక్షల విలువైన ఇంటి స్థలం దక్కుతుంది.
జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ స్థలానికి మార్కెట్‌లో సరైన ధర రాకపోవడం, మరోవైపు తాను కట్టుకుంటున్న కొత్త ఇంటికి నవంబర్‌లో డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండటంతోనే ఈ వినూత్న పద్ధతిని ఎంచుకున్నానని రాంబ్రహ్మం తెలిపారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ స్థలాన్ని అమ్మకానికి పెట్టినా, ఆశించిన ధర రాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పరుగులు తీస్తున్న జనం
యజమాని రాంబ్రహ్మం ఆలోచన చాలా మందిని ఆకట్టుకుంది. కేవలం రూ. 500 ఖర్చుతో రూ. 16 లక్షల విలువైన ఆస్తిని సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో, స్థానికులు ఉత్సాహంగా కూపన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూపన్లు అమ్ముడైనట్లు సమాచారం. 'ఐడియా అదిరింది' అంటూ స్థానికులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, లక్కీ డ్రా పద్ధతి చట్టబద్ధతపై కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ, రాంబ్రహ్మం అవసరాన్ని అర్థం చేసుకుని ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
నవంబర్ 2న తీసే డ్రాలో ఆ రేకుల గది స్థలం ఎవరి సొంతమవుతుందోనని చౌటుప్పల్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక అవసరం... యజమాని వినూత్న ఆలోచన.. ఈ లక్కీ డ్రా అంశం ప్రస్తుతం చౌటుప్పల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
దసరాకు చుక్కా, ముక్కా బంద్
ఇదిలా ఉంటే తెలంగాణలో ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా మద్యం, మాంసం ప్రియులకు నిరాశ ఎదురైంది. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి పండుగతో పాటు మహాత్మా గాంధీ జయంతి కూడా ఒకే రోజు వచ్చింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా మద్యం విక్రయాలు, జంతువధ, మాంసం విక్రయాలపై నిషేధం అమలు చేయడం ఆనవాయితీ.
ఈసారి దసరా పండుగ రోజునే గాంధీ జయంతి రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంక్షలను యథావిధిగా అమలు చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 2వ తేదీన మద్యం దుకాణాలు (వైన్ షాపులు, బార్‌లు, పబ్‌లు) పూర్తిగా మూసివేయబడతాయి. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో వధశాలలు, మాంసం దుకాణాలను కూడా మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దసరా పండుగను తెలంగాణలో మాంసం, మద్యంతో ఘనంగా జరుపుకోవడం సర్వసాధారణం. పండుగ రోజున 'ముక్కా-చుక్కా' (మాంసం, మద్యం) లేకపోతే పండుగ సంబరం ఉండదని భావించేవారున్నారు. అందుకే, ఈ డ్రై డే కారణంగా మద్యం, మాంసం ప్రియులు ముందుగానే తమకు కావలసిన స్టాక్‌ను కొనుగోలు చేసుకునేందుకు వైన్ షాపులు, మాంసం దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. దసరాకు సాధారణంగా వచ్చే భారీ ఆదాయంపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది.