బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య నిన్న వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. ఆ పార్టీ నేతలతో కృష్ణయ్య టచ్ లోకి వెళ్లారన్న టాక్ నడుస్తోంది. మోదీ, అమిత్ షా నేరుగా కృష్ణయ్యతో ఫోన్లో మాట్లాడారని సమాచారం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఇక్కడ బీసీ నినాదంతో బలపడాలని వ్యూహాలు రచిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్యకు అవకాశం ఇస్తే తమకు పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన మాదిగలను వర్గీకరణ అంశంతో దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. మందకృష్ణ మాదిగ గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం ప్రచారం కూడా చేశారు. మాదిగలతో పాటు బీసీలను కూడా దగ్గర చేసుకుంటే తెలంగాణలో తమకు తిరుగు ఉండదని బీజేపీ భావిస్తోంది.
బీసీ కమిషన్ చైర్మన్ పదవి..
ఇందులో భాగంగా బలమైన బీసీ సంఘం నేతగా పేరున్న ఆర్ కృష్ణయ్యను తమ పార్టీలో చేర్చుకోవాలని ఆ పార్టీ చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. ఆయనకు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ మేరకు ఆర్ కృష్ణయ్య నుంచి బీజేపీలో చేరే అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.