/rtv/media/media_files/2025/08/02/telangana-mlas-defection-2025-08-02-13-36-35.jpg)
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు స్పీకర్ కు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా? వేయరా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లలో విజయం సాధించి మేజిక్ ఫిగర్ సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అయితే.. ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, శేరిలింగంపల్లి - అరికెపూడి గాంధీ, జగిత్యాల-సంజయ్, పటాన్ చెరు- గూడెం మహిపాల్ రెడ్డి, చేవెళ్ల - కాలె యాదయ్య, రాజేంద్రనగర్ - ప్రకాశ్ గౌడ్, గద్వాల కృష్ణ మోహన్ రెడ్డి, బాన్సువాడ- పోచారం శ్రీనివాస రెడ్డి ఉన్నారు. ఈ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని.. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ చెబుతోంది.
అయితే.. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై మాత్రమే అనర్హత వేటు పడే ఛాన్స్ ఉందన్న చర్చ సాగుతోంది. వీరు పార్టీ ఫిరాయించనట్లు బలమైన ఆధారాలు ఉన్నాయని.. మిగతా వారికి సంబంధించి అలాంటి ప్రూఫ్స్ లేవని ప్రచారం జరుగుతోంది. ఇందులో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేశారు. ఆమె తరఫున శ్రీహరి విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. చేయి గుర్తుకు ఓటు వేసి కావ్యను గెలిపించాలని అనేక సభల్లో కోరారు.
బీఆర్ఎస్ వద్ద బలమైన ఆధారాలు..
ఇందుకు సంబంధించిన వీడియోలు, న్యూస్ పేపర్లలో ప్రచురిమైన క్లిప్ లను బీఆర్ఎస్ ఇప్పటికే స్పీకర్ తో పాటు కోర్టులకు అందించింది. తెల్లం వెంకట్రావు సైతం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం పని చేసిన వీడియోలు బీఆర్ఎస్ వద్ద ఉన్నాయి. ఈ ఆధారాలతో ఈ ముగ్గురిపై వేటు ఖాయమన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్లు సూచిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని స్పష్టం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ జారీ చేసే విప్‌లను ఫాలో కావాలని చెబుతున్నారు. ఇంకా అవసరం వచ్చినప్పుడల్లా తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ఈ సూచనలు ఫాలో అవుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏకంగా తన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో వేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను బీఆర్ఎస్ లో గెలిచానని.. ఇలా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికే ఆ ఎమ్మెల్యే వ్యూహాత్మకంగా ఇలా చేశారన్న చర్చ సాగుతోంది.