/rtv/media/media_files/2025/01/21/z5Ie5pnaXzfiAunLV45U.jpg)
Telangana Singer Madhu Priya
Singer Madhu Priya : తెలంగాణకు చెందిన ప్రముఖ సింగర్ మధుప్రియ వివాదంలో చిక్కుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో మధుప్రియపై ఒక ప్రైవేటు పాటను చిత్రీకరించడం వివాదానికి కారణమైంది. ఈ విషయమై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా చాలా వరకు ఆలయాల్లో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని అనుమతించరు. అలాగే కాళేశ్వర ఆలయంలోనూ ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతి లేదు. అయితే మధుప్రియతో పాటు పాట చిత్రీకరించే బృందం ఏకంగా గర్భగుడిలోకి వెళ్లి పాటను చిత్రీకరించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దేవాలయంలో ఫొటోలు తీయడానికి అనుమతి లేనప్పుడు మధుప్రియ గర్భగుడిలోకి ఎలా వెళ్లిందని భక్తులు ఆలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. భక్తుల మనోభావాలను మధుప్రియతో పాటు ఆలయ అధికారులు దెబ్బతీశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే మధుప్రియతో పాట పాట చిత్రీకరించిన బృందం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ అనుమతితోనే ఆలయంలో పాట చిత్రీకరించారని కొంతమంది అంటుండగా, స్థానికంగా ఉండే ఆలయ సిబ్బందిని ఒప్పించి పాటను చిత్రీకరించారని మరికొందరు అంటున్నారు. ఆలయంలో భక్తులు ఫొటోలు తీస్తేనే అడ్డుకునే సిబ్బంది మధుప్రియ పాట చిత్రీకరించేందుకు ఎలా అనుమతి ఇచ్చారనే ప్రశ్నలు ఇప్పుడు భక్తుల్లో వ్యక్తం చేస్తున్నారు.
కాగా గతంలో ఆంధ్రప్రదేశ్ లోని ఏపీలోని శ్రీకాళహస్తి కాలభైరవ స్వామి ఆలయంలో ప్రముఖ సింగర్ మంగ్లీ ఒక ప్రైవేట్ ఆల్బమ్‌కు చెందిన ఓ పాటను చిత్రీకరించింది. దీంతో అది పెద్ద వివాదానికి దారితీసింది. ఆ సమయంలో మంగ్లీ భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
కాగా కాళేశ్వరం ఆలయంలో పాట చిత్రీకరణపై అధికారులు వివరణ ఇస్తూ సింగర్ మధుప్రియ పాట షూటింగ్ కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆలయ ఈవో తెలిపారు. అయితే షూటింగ్ సమయంలో విధుల్లో ఉన్న పూజారికి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మధుప్రియ ఎవరి అనుమతితో పాట చిత్రీకరించిందనే అంశంపై విచారణకు ఆదేశించామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.