CM Revanth Reddy : విద్యార్థిగా రేవంత్‌! హార్వర్డ్‌ యూనివర్సిటీలో వారం రోజుల కోర్సులో చేరిక

తెలంగాణ సీఎం  రేవంత్‌రెడ్డి మరోమారు విద్యార్థిగా మారనున్నారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ అయిన హార్వర్డ్‌ యూనివర్సిటీలో ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం’ అనే అంశంపై నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సులో ఆయన చేరనున్నారు.

New Update
CM Revanth

CM Revanth

CM Revanth Reddy : తెలంగాణ సీఎం  రేవంత్‌రెడ్డి మరోమారు విద్యార్థిగా మారనున్నారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ అయిన హార్వర్డ్‌ యూనివర్సిటీలో ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం’ అనే అంశంపై నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సులో ఆయన చేరనున్నారు. కాగా పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ రోజు దావోస్‌కు వెళ్లనున్నారు. ఆ సదస్సు ముగిసిన తర్వాత.. ఈ నెల 23న అక్కడి నుంచి ఆయన అమెరికాకు వెళతారు. హార్వర్డ్‌ కెనెడీ స్కూల్‌- ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సుకు సంబంధించి ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగే క్లాసులకు విద్యార్థిగా రేవంత్‌రెడ్డి హాజరు అవుతారు. కోర్సు ముగిసిన అనంతరం.. హార్వర్డ్‌ యూనివర్సిటీ అందజేసే సర్టిఫికెట్‌ను తీసుకొని అమెరికా నుంచి తిరిగి వస్తారు. ఫిబ్రవరి 2న హైదరాబాద్‌కు చేరుకుంటారు.

కాగా, హార్వర్డ్‌ కెనెడీ స్కూల్‌ నిర్వహిస్తున్న ఈ వారం రోజుల కోర్సు.. అనుభవజ్ఞులైన నాయకుల కోసం రూపొందించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. క్లిష్టమైన పరిస్థితుల్లో నాయకత్వం ఎలా ఉండాలి? అనిశ్చిత పరిస్థితులు, మార్పులు, విభేదాలను ఎలా ఎదుర్కోవాలి? అధికారంతో కాకుండా ప్రభావంతో ఎలా నడిపించాలి? అనే అంశాలు ఈ కోర్సులో ఉంటాయని తెలుస్తోంది. ఈ కోర్సును మసాచుసెట్స్‌లోని హార్వర్డ్‌ కెనెడీ స్కూల్‌ క్యాంప్‌సలో ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ సీనియర్‌ అధికారులు, కార్పొరేట్‌ కంపెనీల డైరెక్టర్లు, సీఈవోలు, సీనియర్‌ మేనేజర్లు, స్వచ్ఛంద సంస్థల నాయకులకు ఉపయోగకరంగా ఉంటుందని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఈ కోర్సులో పాల్గొనేవారికి నాయకత్వం అంటే.. ఆచరణ, సంఘర్షణలను సానుకూలంగా ఎలా మలచుకోవాలి, ప్రజలను మార్పు వైపునకు ఎలా ప్రేరేపించాలి వంటి అంశాలను బోధిస్తారు. వ్యక్తిగత నాయకత్వ శైలిపై లోతైన విశ్లేషణా ఉంటుంది. బోధనా విధానం.. కేస్‌ స్టడీస్‌, గ్రూప్‌ డిస్కషన్స్‌, రియల్‌ లైఫ్‌ లీడర్‌షిప్‌ లో ఎదురయ్యే సమస్యలపై చర్చ, స్వీయ ఆత్మపరిశీలన పద్ధతుల్లో కోర్సు ఉంటుంది. కాగా, భారతదేశం నుంచి ఈ తరహా కోర్సుకు ప్రత్యక్షంగా హాజరై అభ్యసించనున్న తొలిసీఎం రేవంతే కావడం విశేషం.

నేడు దావోస్‌కు సీఎం..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రోజు ఉదయం 10 గంటలకు దావోస్‌కు  వెళ్తున్నారు. మేడారం పర్యటనలో ఉన్న సీఎం.. అనంతరం మేడారం నుంచి హెలికాప్టర్‌లో నేరుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు దావోస్‌కు బయలుదేరి వెళతారు. కాగా, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఇప్పటికే దావోస్‌కు చేరుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,ఇతర అధికారులు  కూడా ఆయన వెంట దావోస్‌కు వెళ్లనున్నారు. దావోస్‌లో పెట్టుబడుల సదస్సు ముగిసిన తర్వాత 23న సీఎం అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడి కోర్సు ముగిశాక తిరిగి హైదరాబాద్‌కు ఫిబ్రవరి 2న చేరుకుంటారు.

Advertisment
తాజా కథనాలు