Abhaya Hastham : అభయహస్తం నిధుల విడుదల

గత కొన్నేండ్లుగా నిలిచిపోయిన అభయహస్తం నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది.  2009 నుంచి 2016 వరకు ఈ పథకం కింద స్వయం సహాయక బృందాల మహిళలు జమ చేసిన మొత్తాన్ని తిరిగి మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సెర్ప్ ద్వారా జాబితాను రెడీ చేస్తున్నారు.

New Update
Abhaya Hastham

Abhaya Hastham

Abhaya Hastham : గత కొన్నేండ్లుగా నిలిచిపోయిన అభయహస్తం నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది.  2009 నుంచి 2016 వరకు ఈ పథకం కింద స్వయం సహాయక బృందాల మహిళలు జమ చేసిన మొత్తాన్ని తిరిగి మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు  గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా  గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను రెడీ చేస్తున్నారు.

స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతను ఇచ్చేందుకు 2009లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని రూపొందించింది.  సంఘంలో చేరిన ప్రతి మహిళా సభ్యురాలు ఈ పథకంలో సంవత్సరానికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే  ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తూ వచ్చింది.  ఈ పథకంలో చేరిన సంఘ సభ్యుల వయసు 60 ఏండ్లు దాటితే వారికి రూ.500 పింఛన్ అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేసింది.

 దీంతోపాటు ప్రతి కుటుంబంలో 9, 10, ఇంటర్, ఐటీఐ చదువుతున్న పిల్లలకు ఏడాదికి రూ.1,200 చెల్లించింది. సభ్యురాలు సహజ మరణం పొందితే రూ.30 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75 వేలు, శాశ్వత వైకల్యానికి రూ.75 వేలు, పాక్షిక వైకల్యానికి రూ.37,500  చెల్లించేవారు. అయితే, 2016 వరకు ఈ పథకం సజావుగానే  కొనసాగింది. ఆ తర్వాత  బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే 2018లో ఆసరా పింఛన్ ప్రారంభించి.. పింఛన్ సొమ్ము రెట్టింపు చేసింది.  గతంలో అభయహస్తంలో భాగంగా కట్టిన  సొమ్ము తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది చెల్లింపులకు నోచుకోలేదు.దీంతో 60 ఏండ్లు దాటిన మహిళలు ఇటు అభయ హస్తం, అటు ఆసరా డబ్బులు చెల్లించినా సొమ్ము రాక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్దులు తమకు ఆసరా అవుతుందనుకుంటే నిరాశే మిగిలింది. అయితే గతేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వీరి సొమ్ము చెల్లించేందుకు ముందుకు వచ్చింది.

 ప్రభుత్వం తెలిపిన వివరాలు ప్రకారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా అభయహస్తం నిధులు సుమారు రూ.425  కోట్లు మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నది. 2009 నుంచి 2016 వరకు 21 లక్షల మంది మహిళలు జమ చేసిన సొమ్ము ప్రభుత్వం వద్దే ఉండగా.. 2022 మార్చి నాటికి అసలు, వడ్డీ కలిపి రూ.545 కోట్లయింది. 2022లో గత ప్రభుత్వం రూ.152 కోట్లను మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అది కూడా కేవలం సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోని మహిళలకు చెందిన బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసినట్టు తెలిసింది. మరో రూ.393 కోట్లు ఇంకా చెల్లించలేదు. ఈ విషయమై ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఆ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం వడ్డీతో కలిసి  రూ.425 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేలా సర్కారు నిర్ణయం తీసుకున్నది. 

ఆయా మహిళా సంఘాలలో పనిచేస్తున్న జిల్లాలు, మండలాలు, గ్రామాల వారిగా లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. అభయ హస్తంలో ప్రీమియం సొమ్ము చెల్లించిన లబ్ధిదారులను గుర్తించి వారి ఆధార్, బ్యాంకు ఖాతాల సమాచారం సేకరిస్తున్నారు. లబ్ధిదారుల లెక్క తేలిన తర్వాత  ప్రభుత్వం తిరిగి సొమ్ము వారి అకౌంట్లలో జమ చేయనున్నది. అంతేకాకుండా, గతంలో మాదిరిగా సభ్యురాళ్ల కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలకు స్కాలర్ షిప్ కూడా అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు